స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. మనలో చాలామంది స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లను ఉపయోగిస్తుంటారు. రోజులో ముప్పావు భాగం వాటిపైనే గడిపేస్తుంటారు. వారి పని ఒత్తిడి అలా ఉంటుంది మరి. అందులో వారిని నిందించడానికి కూడా ఏమీ లేదు. తమ ఉద్యోగాల కారణంగా ఎక్కువ గంటలు స్మార్ట్‌ఫోన్‌లు లేదా కంప్యూటర్‌లను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ల స్క్రీన్‌లు కళ్లపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి.
కాలిఫోర్నియాలోని శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జీన్ ట్వెంగే, స్మార్ట్‌ఫోన్‌లోని బ్లూ లైట్ నిద్రలేమికి దారితీస్తుందని కనుగొన్నారు. నేత్ర వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటు పడడం వల్ల కంటికి సంబంధించిన అనేక ఇతర సమస్యలు వస్తాయి.
నిపుణులు ఏమంటారు?
ఢిల్లీలోని బజాజ్ ఐ కేర్ సెంటర్‌లో కంటి స్పెషలిస్ట్ డాక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ... చాలా గంటలు స్క్రీన్‌ని చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. కంప్యూటర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వచ్చే కంటి సమస్యలను కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) అంటారు. కంప్యూటర్ స్క్రీన్‌పై పనిచేసే వారిలో చాలా మందిలో ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లలో కార్టూన్లు చూసే వాళ్లు, గేమ్‌లు ఆడే పిల్లలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు.
డాక్టర్ బజాజ్ ప్రకారం, మీకు కంటి సమస్యలు ఉంటే, మీరు స్క్రీన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు సరైన అద్దాలు ధరించకపోతే, మీరు మీ సమస్యను మరింత తీవ్రతకు కారణమవుతారని హెచ్చరిస్తున్నారు. స్క్రీన్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చూపు మసకబారడం, కళ్లు పొడిబారడం, కళ్లలో చికాకు, తలనొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.
కంటి సమస్యలను ఎలా నివారించాలి
ఐ స్పెషలిస్టుల అభిప్రాయం ప్రకారం పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్‌ను చూడకూడదు. మీరు ఆఫీసులో ఎక్కువ గంటలు పని చేస్తే, మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. 20 నిమిషాలు పని చేసిన తర్వాత, 20 సెకన్ల విరామం తీసుకోండి. ఈ సమయంలో మీ కనురెప్పలను 20 సార్లు రెప్పవేయండి. కళ్లలో పొడిబారినట్లయితే, మీరు ఐ స్పెషలిస్టును సంప్రదించాలి. ఆ తర్వాత తగిన చుక్కల మందు తీసుకోవచ్చు. ఇలా ఎక్కువ సమయం కంప్యూటర్, మొబైల్‌పై పని చేసేవాళ్లు... ప్రతి మూడు నెలలకోసారి కంటి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
వీటితోపాటు ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంంది. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. విటమిన్లు, ఖనిజాలు, పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది.
మన కంటి చూపును కాపాడటానికి వ్యాయామం(Exercise) సహాయపడుతుంది. వ్యాయామం చేయడం ద్వారా ఆక్సిజన్, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు కళ్లు పొడి బారకుండా చూస్తోంది.
పొగతాగడం అనేది అనారోగ్యానికి ఎంతో హాని. స్కోకింగ్ చేసే వాళ్లు కంటి సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి స్మోకింగ్‌ను దూరం చేసుకోండి.
కెరోటినాయిడ్స్(Carotenoids) ఆధారిత ఆహారాలను తీసుకోవడం వల్ల మన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు తరచుగా తీసుకోవడం వల్ల కళ్ల సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ఈ పద్ధతులు పాటిస్తూ అనుమానం వస్తే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించండి. అంతేకాదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా వైద్యులతో పరిష్కరించుకోవడం మంచిది.
గమనిక: ఈ వివరాలను మీ అవగాహన కోసమే అందించాం. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎటువంటి సందేహాలున్నా వైద్యుడిని సంప్రదించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.