వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ ఫీవర్‌లు పెరుగుతున్నాయి. వడదెబ్బ కారణంగా కూడా జ్వరం వచ్చే అవకాశం ఉంది. దగ్గు, వికారం, వాంతులు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలా ఏవి వచ్చినా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కనీసం మూడు రోజులపాటు ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది .అయితే చాలామంది యాంటీబయోటిక్స్ వేస్తే త్వరగా ఉపశమనం కలుగుతుందని వాటిని వాడడం పెంచారు. అందులోనూ వైద్యులను సంప్రదించకుండా వాడే వారి సంఖ్య పెరిగిపోయింది. గతంలో ఎప్పుడో తమకు జ్వరం వచ్చినప్పుడో, ఆరోగ్యం బాగోలేనప్పుడు వైద్యులు రాసిన ప్రిస్ట్రిప్షన్ ఆధారంగా తరచూ ఆ యాంటీబయోటిక్స్ వాడడం అలవాటు చేసుకున్నారు. ఇది చాలా ప్రమాదకరమని చెప్తోంది వైద్య సంఘం.


ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సాధారణంగా 5 నుండి 7 రోజులు వరకు ఉంటుందని, మూడు రోజుల తర్వాత జ్వరం తగ్గుతుందని, అదే దగ్గు అయితే మూడు వారాల వరకు ఉంటుందని చెబుతోంది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్.  ఆ సమయాన్ని కాసేపు ఓపికగా భరిస్తే ఏ ఇన్ఫెక్షన్ అయినా పోతుందని వివరిస్తోంది. సాధారణ మందులను వాడుతూ ఉండాలని చెబుతోంది. కానీ ఎక్కువమంది యాంటీబయోటిక్స్ వాడడానికి ఇష్టపడుతున్నారు. 


ఇవి వద్దు...
వేగంగా కోలుకోవడానికి ప్రజలు యాంటీబయోటిక్స్ అధికంగా తీసుకుంటున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెబుతోంది. ఇందులో భాగంగా వైద్యులకు కొన్ని సూచనలు చేసింది. తరచూ యాంటీబయోటిక్స్ ఇవ్వడం మానుకోవాలని, అవసరం అయితేనే వాటిని సూచించాలని వైద్యులకు చెప్పింది. ఇలా తరచూ యాంటీబయోటిక్స్ వాడే వారిలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ సమస్య పెరుగుతుందని తెలిపింది. అంటే యాంటీబయోటిక్  మందులకు కూడా లొంగకుండా మీ శరీరంలో రోగం లేదా ఇన్ఫెక్షన్ మొండిగా మారుతాయి. ఇలా జరగడం వల్ల అవసరమైన సమయాల్లో యాంటీబయోటిక్స్ మీ శరీరంపై పనిచేయవు. అందుకే చిన్న చిన్న సమస్యలకు యాంటీబయోటిక్స్ తీసుకునే అలవాటును మానుకోవాలి అని,  కొన్ని రకాల యాంటీబయోటిక్స్ ను ప్రజలకు ఇవ్వడం తగ్గించాలని... ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులకు సూచించింది.  ఆ యాంటీబయోటిక్స్ జాబితా ఇదిగో...


అజిత్రోమైసిన్ (Azithromycin)
అమోక్సిక్లావ్ (Amoxiclav)
అమోక్సిసిలిన్ (Amoxicillin)
నార్ఫ్లోక్సాసిన్ (Norfloxacin)
సిప్రోఫ్లోక్సాసిన్ (Ciprofloxacin)
ఆఫ్లోక్సాసిన్ (Ofloxacin)
లెవ్ఫ్లోక్సాసిన్ (Levfloxacin)
ఐవర్‌మెక్టిన్ (Ivermectin)


యాంటీబయోటిక్స్ దుర్వినియోగం అవుతున్న కారణంగానే ఈ సూచనలు చేసినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వివరించింది. 70% డయేరియా కేసులు వైరల్ డయేరియా వల్ల వస్తాయి. దీనికి యాంటీబయోటిక్స్ అవసరం లేదు కానీ వైద్యులు ఎక్కువమంది సూచిస్తున్నారు. అలాంటి సమయాల్లో ఎలాంటి యాంటీబయోటిక్స్ వాడకుండా కేవలం సాధారణ మందులు వాడడం వల్ల  సమస్యను తగ్గించుకోవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచించింది. కోవిడ్ సమయంలో యాంటీబయోటిక్స్ అయిన అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్ టాబ్లెట్లను విస్తృతంగా ఉపయోగించారు. దీనివల్ల చాలామందిలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కనబడింది. అంటే వారిలో యాంటీబయోటిక్స్ సమర్థంగా పనిచేయలేదు. ఈ పరిస్థితి అందరిలో తలెత్తితే రోగాలు మరింత మొండిగా మారిపోయి ప్రాణాంతకంగా దాపురిస్తాయి. 






Also read: మందార పువ్వులతో ఇలా చేయండి చాలు, మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేస్తుంది