ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా 20 ఏళ్ల యువకులు కూడా గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ, కాలేజీలో నడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయిన యువకుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారే గుండె ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించేవారు. ఇప్పుడు యువత కూడా గుండె జబ్బుల ప్రమాదంలో పడింది, కాబట్టి గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలపై అవగాహన పెంచుకుంటే ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంది.
ఎందుకు వస్తుంది?
గుండెపోటు రావడానికి ప్రధాన కారణం రక్తనాళాల్లో రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం జరిగితే గుండె సరిగా రక్త సరఫరా చేయలేదు. దీనివల్ల గుండెపోటు వస్తుంది. ప్రపంచంలో గుండె జబ్బుల కారణంగా ప్రతి ఏటా 17 మిలియన్లకు పైగా వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఐదవ వంతు మమరణాలు సంభవిస్తున్నది మనదేశంలోనే.
హృదయ సంబంధ వ్యాధులు అనేక రకాలుగా ఉంటాయి అధిక రక్తపోటు వల్ల కలిగేవి, అరిథ్మియా, హృదయ ధమణి వ్యాధి ఇలా రకరకాలుగా రక్తనాళాల్లో ఇబ్బందులను కలుగ చేసే జబ్బులు ఉన్నాయి. ఏదేమైనా చివరకు జరిగేది గుండెపోటు రావడమే. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు.
కనిపించే లక్షణాలు
1. ఛాతి నొప్పి వస్తూ పోతూ ఉంటుంది.
2. శ్వాస సరిగా ఆడదు.
3. చేయి లేదా భుజం నొప్పి వేధిస్తూ ఉంటుంది.
4. బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఈ లక్షణాలు గుండెపోటు రావడానికి కొన్ని వారాలు లేదా రోజులు ముందు జరగవచ్చు. కొందరి విషయంలో గంటల ముందు కూడా ఇవి కనిపించే అవకాశం ఉంది. మెడ గట్టిగా పట్టేయడం, భుజం నొప్పి, అజీర్ణం, అలసట, చల్లని చెమటలు పట్టడం కూడా గుండెపోటు రాకకు ముందస్తు సంకేతాలే. అలాగే మానసిక ఆందోళన, ఏదో వినాశనం జరగబోతుంది అంటూ వచ్చే ఆలోచనలు, గుండె దడ, శ్వాస సరిగా ఆడక పోవడం కూడా తీవ్రంగా పరిగణించాల్సిన లక్షణాలు. ఇక్కడ చెప్పినవన్నీ రోజుల్లో కాసేపు వచ్చి పోతుండటంతో ఎక్కువమంది వీటిని తేలిగ్గా తీసుకుంటారు. ఇవి కొన్ని నిమిషాల పాటు లేదా సెకండ్ల పాటు కనిపించినా కూడా గుండె వైద్యులను కలిసి పరిస్థితిని వివరించడం చాలా ముఖ్యం.
గుండెపోటు పురుషుల కంటే మహిళల్లో ప్రాణాంతకంగా కనిపిస్తోంది. ఎందుకంటే స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చాక పురుషులు కోలుకోగలుగుతున్నారు కానీ మహిళలకు కోలుకోవడం సవాలుగా మారుతుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల కూడా గుండెపోటు రావచ్చు, అయితే ఇలా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం అనేది మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా ఉంది. గుండెపోటు వచ్చే అవకాశం మాత్రం మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువ. పురుషుల్లో గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలుగా ఛాతిలో నొప్పి, చెమటలు పట్టడం, అజీర్ణం వంటివి చెబుతారు. అదే మహిళల్లో అయితే శ్వాస ఆడక పోవడం, దవడ నొప్పి, వెన్ను నొప్పి, అలసటగా అనిపించడం, నిద్ర పట్టకపోవడం వంటివి కనిపిస్తాయి.
Also read: పిసిఓఎస్ సమస్యతో బాధపడే మహిళలు తినాల్సిన, తినకూడని ఆహార పదార్థాల జాబితా ఇదిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.