WPL 2023, UPW vs MIW: ముంబయి: విమెన్ ప్రీమియర్ లీగ్ లో ముంబయి ఇండియన్స్‌ మరోసారి సత్తా చాటింది. వరుస విజయాలతో ముంబై జైత్రయాత్ర కొనసాగుతోంది. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలతో ఉన్న ముంబై ఇండియన్స్ తాజాగా ఆదివారం నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఆదివారం రాత్రి యూపీ వారియర్స్‌ పై ఛేజింగ్ చేసి నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 


ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఓ మోస్తరు లక్ష్యాన్ని ముంబై ముందు నిలిపింది. కానీ పటిష్ట ముంబై జట్టుకు ఈ లక్ష్యాన్ని ఛేదించడం ఏమాత్రం ఇబ్బంది కాలేదు. 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ముంబై ఇండియన్స్ 164 పరుగులు చేసి విజయఢంకా మోగించింది హర్మన్ ప్రీత్ సేన. నాట్‌ సీవర్‌ (45 నాటౌట్‌; 31 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌), ఓపెనర్‌ యాస్తిక భాటియా (42; 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించారు. మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్ (53; 33 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ హాఫ్ సెంచరీ చేసింది. దాంతో మరో 15 బంతులు మిగిలుండగానే హర్మన్ ప్రీత్ సేన వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది.






58 పరుగుల వద్దే ముంబై ఇండియన్స్ 2 వికెట్లు కోల్పోగా, మరో వికెట్ పడకుండానే కెప్టెన్ హర్మన్ ప్రీత్, వన్ డౌన్ బ్యాటర్ నాట్ సీవర్ మిగతా పనిని పూర్తి చేశారు. పాయింట్ల పట్టికలో ముంబై అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూపీ వారియర్స్ బౌలర్లలు రాజేశ్వరి గైక్వాడ్, సోఫీ ఎకిల్ స్టోన్‌ చెరో వికెట్‌ తీశారు. కానీ ముంబై బ్యాటర్లకు అడ్డుకట్ట వేయలేకపోయారు. 






రాణించిన అలీసా హేలీ, మెక్ గ్రాత్
యూపీ వారియర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయగా.. యూపీ బ్యాటర్లలో కెప్టెన్‌ అలీసా హేలీ (58; 46 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), తాహిలా మెక్‌గ్రాత్‌ (50; 37 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. కిరణ్ నవ్‌గిరె (17; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆ తరువాత టాప్ స్కోరర్. దీప్తి శర్మ (7), దేవికా వైద్య (6), ఎకిల్ స్టోన్‌ (1) విఫలమయ్యారు. యూపీ వారియర్స్ చివరి ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయింది. లేకపోతే ఆ జట్టు మరిన్ని పరుగులు చేసేది. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్‌ మూడు వికెట్లు పడగొట్టింది. అమేలియా కెర్‌ 2, హేలీ మాథ్యూస్‌ ఒక వికెట్‌ తీశారు. నిర్ణీత ఓవర్లలో యూపీని 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకు కట్టడి చేశారు ముంబై బౌలర్లు.