శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ అవసరం. అయితే అది అవసరానికి మించి ఉంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అధిక కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోయినప్పటికీ దురదృష్టవశాత్తు అది త్వరగా బయటపడదు. పెద్దగా లక్షణాలను కూడా చూపించదు. అయితే అప్పుడప్పుడు కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపించవచ్చు. అందులో ఒకటి కాలు నొప్పి. కాలు నొప్పి వచ్చాక విశ్రాంతి తీసుకున్న కొంతసేపటికి తగ్గిపోతే అది అధిక కొలెస్ట్రాల్ వల్లనేమోనని అనుమానించాలి. దీన్నే ‘పెరిఫెరల్ ఆర్డరీ డిసీజ్’ అని అంటారు.
ఏంటి డిసీజ్?
పెరిఫెరల్ ఆర్టరి డిసీజ్ ఉన్నవారిలో రక్తంలో అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ ధమనుల్లో ఫలకాలు ఏర్పడడానికి దారితీస్తుంది. ఈ ఫలకాలు కొవ్వు, సెల్యులార్ వ్యర్థ పదార్థాలు, క్యాల్షియం, ఫైబర్ వంటి మిశ్రమాలతో ఏర్పడుతుంది. దీనివల్ల ధమనుల్లో రక్తప్రసరణను ఇది అడ్డుకోవడం లేదా ఇరుకుగా మార్చడం చేస్తాయి. అలాంటప్పుడు శరీరంలోని వివిధ భాగాలతో పాటు ముఖ్యంగా కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అప్పుడు ఈ వ్యాధి వస్తుంది.
కాలు నొప్పి మొదటి లక్షణం
కొందరిలో కాలు నొప్పి వచ్చాక విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే ఈ కాలు నొప్పి తగ్గిపోతుంది. అంటే దానికి అర్థం వారికి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉందని. ఈ వ్యాధి ఉన్నవారిలో అధిక కొలెస్ట్రాల్ అధికంగా ఉందని అర్థం చేసుకోవాలి. కాళ్లలో తిమ్మిరి పట్టడం, అసౌకర్యానికి గురి కావడం వంటివి కూడా కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలు విశ్రాంతి తీసుకోగానే తగ్గిపోతూ ఉంటాయి. అందుకే దీన్ని ఎవరూ పట్టించుకోరు.
మనం నడుస్తున్నప్పుడు కండర కణాలు కష్టపడతాయి. కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాలు మూసుకు పోవడం వల్ల కాళ్ళకు రక్తప్రసరణ సరిగా అందదు. అలాంటప్పుడు కండరకణాలు కష్టపడడానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడుతుంది. అందుకే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు నడుస్తున్నప్పుడు లేదా పరిగెడుతున్నప్పుడు, నిల్చున్నప్పుడు కాళ్ల నొప్పులు వస్తాయి. అదే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ కణాలకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉండదు. కాబట్టి ఆ నొప్పి లేదా అసౌకర్యం తగ్గిపోతుంది. కాళ్ళకు తక్కువ రక్త ప్రసరణ జరగడం వల్ల ఏదైనా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు కండరాలు నిస్తేజంగా, నొప్పిగా, తిమ్మిరిగా అనిపిస్తాయి.
ఇతర సంకేతాలు
శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు కాలు నొప్పి లేదా కాళ్లలో అసౌకర్యం కాకుండా మరికొన్ని లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. రాత్రి సమయంలో పడుకున్నప్పుడు మీ పాదాలు, కాళ్లలో మంట లేదా నొప్పి రావచ్చు. పాదాల చర్మం చల్లగా కూడా అనిపించవచ్చు. చర్మం రంగులో కూడా మార్పులు రావచ్చు. కాలి పుండ్లు, పాదాల పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించినా అధిక కొలెస్ట్రాల్ ఉందని అర్థం చేసుకోవాలి.
Also read: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.