అన్నీ ఆహారాలకు తాళ్లయిలాంటివి చిరుధాన్యాలు. అందుకే 2023 ని 'ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్' గా ప్రకటిస్తున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకొచ్చారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, అరికెలు, సామలు, ఊదలు.. వంటివి చిరుధాన్యాలుగా పిలుస్తారు. పూర్వం వరి బియ్యం కంటే వీటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కానీ బియ్యం వాడుకలోకి వచ్చిన తర్వాత ఎంతో ఆరోగ్యకరమైన చిరుధాన్యాలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు అనేక అనారోగ్యాల కారణంగా మళ్ళీ వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.


ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి, ఐరన్ వంటి ఖనిజాలతో మిల్లెట్స్ నిండి ఉంటాయి. ఇవి గ్లూటెన్ రహిత సూపర్ ఫుడ్స్. మధుమేహాన్ని నియంత్రించి గుండెని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. గ్లూటెన్ అనేది గోధుమ, బార్లీ, ట్రిటికెల్ లో లభించే ప్రోటీన్. గ్లూటెన్ రహిత ఆహారం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మిల్లెట్స్ ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. సరైన పద్ధతిలో వాటిని తీసుకోకపోతే అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకునే ముందు వాటిని ఎలా తినాలో పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.


రాగులు


రాగులు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కానీ రాగులు శరీరానికి వెచ్చదనం ఇస్తాయి. చలికాలంలో వీటిని ఎక్కువగా తీసుకోవాలి. రాగుల్లో కాల్షియం, ప్రోటీన్లు, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బియ్యానికి మంచి ప్రత్యామ్నాయం. మీరు ఇప్పటి వరకు మిల్లెట్స్ తినకపోతే రాగులతో మీ డైట్ ని సార్ట్ చేయండి. ఇవి చాలా తేలికైన పదార్థం. ఆ తర్వాత మీరు క్రమంగా మిగతా మిల్లెట్ రకాలు తినడం ప్రారంభించవచ్చు.


జొన్నలు


జొన్నలు ఏడాది పొడవునా తినొచ్చు. ఇందులో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. గోధుమ రోటీల్ స్థానంలో జొన్నలు ఉపయోగించుకోవచ్చు. ఈ గ్లూటెన్ రహిత ధాన్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండెకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తుంది.


సజ్జలు


రాగి మాదిరిగానే సజ్జలు కూడా వేడి చేసే పదార్థమే. చలికాలంలో వీటిని తీసుకుంటే శరీరానికి వేడిని ఇస్తుంది. సమ్మర్ లో వీటిని తినాలనుకుంటే మాత్రం చల్లని పదార్థాలతో కలిపి తీసుకోవడం ఉత్తమం. వేసవిలో సజ్జల పిండిని మజ్జిగతో కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇతర మిల్లెట్స్ మాదిరిగానే సజ్జలు క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు తగ్గుతారు. మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన జుట్టు, గోర్లు, చర్మాన్ని కూడా ఇది అందిస్తుంది.


మిల్లెట్స్ తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి


ఇప్పటివరకు అలవాటు లేకుండా ఇప్పుడే చిరుధాన్యాలు తినడం మొదలు పెట్టినట్లయితే ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. తేలికపాటి మిల్లెట్స్ ముందుగా తీసుకుంటూ అలవాటు పడిన తర్వాత ఇతర మిల్లెట్స్ తీసుకోవాలి. ఒక్కసారిగా అన్ని పెంచకూడదు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు నివారించాలని అనుకుంటే వాటిని వండుకునే ముందు తప్పనిసరిగా నానబెట్టాలి. మిల్లెట్స్ తీసుకునే ముందు నానబెట్టడం, మొలకెత్తించడం వంటివి చేయాలి. లేదంటే వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ ఇతర పోషకాల శోషణని తగ్గిస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు మిల్లెట్ వినియోగాన్ని నివారించాలి. ఎందుకంటే ఇది అయోడిన్ శోషణకు ఆటంకం కలిగించే గోయిట్రోజెన్ లను కలిగి ఉంటుంది. గోధుమలతో చేసుకునే రోటీలు, బన్స్, బిస్కెట్లు, కేక్ వంటి పదార్థాలను మిల్లెట్స్ తో కూడా చేసుకోవచ్చు. గోధుమలకి చిరుధాన్యాలు మంచి ప్రత్యామ్నాయం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: కొరియన్ల బ్యూటీ సీక్రెట్ ఇదే - ఈ చిట్కాలను ఇంట్లోనే పాటించవచ్చు