మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే శరీరంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాస్త నిర్లక్ష్యం చూపించినా తనతో పాటూ మరిన్ని ప్రాణాంతక పరిస్థితులను మోసుకొస్తుంది. అందుకే డయాబెటిస్ వచ్చాక ఆహారపరంగా, నిద్ర, వ్యాయామం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం గతి తప్పినా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఇతర అనారోగ్యాలు వచ్చేందుకు రెడీగా ఉంటాయి. అంతేకాదు డయాబెటిస్ అదుపులో లేకపోతే శరీరం ఏ పనికి సహకరించదు. కళ్లు మసకబారడం, నీరసంతో కుంగిపోవడం వంటివి జరుగుతాయి. 


కొత్తగా చేసిన ఓ పరిశోధనలో మధుమేహులు పాలతో చేసిన పదార్థాలు తినడం వల్ల చాలా మేలు జరుగుతుందని తెలిసింది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని కూడా బయటపడింది. కెనడాలోని మెక్ మాస్టర్ యూనివర్సిటికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.ఈ అధ్యయం చాలా సుదీర్ఘకాలం సాగింది. దాదాపు  తొమ్మిదేళ్ల పాటూ 21 దేశాలకు చెందిన లక్షన్నర మందిని ఆహారపు అలవాట్లను పరిశీలించారు. వారిలో రోజుకు రెండుసార్లు పాల పదార్థాలు అంటే పెరుగు, చీజ్, పాలు వంటివి తీసుకునే వారిలో 24 శాతం మందిలో జీవక్రియ రుగ్మతలు తగ్గుతున్నట్టు గుర్తించారు. జీవక్రియ రుగ్మతలంటై మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటివి. 


పాలతో పాటూ గుడ్లు తిన్నా కూడా మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు అధ్యయనకర్తలు. పెరుగు, చీజ్‌తో పాటూ గుడ్లను కూడా రోజు వారి మెనూలో చేర్చుకోవాలి. అయితే గుడ్లు విషమంలో జాగ్రత్త వహించాలి. రోజుకు రెండు కన్నా ఎక్కువ గుడ్లు తినకూడదు. లేకుంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరే అవకాశం ఉంది. 


మధుమేహం వచ్చాక ఆకలి పెరుగుతుంది. కానీ అధికంగా తినకూడదు. అధిక కేలరీలుండే ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగి, మధుమేహం సమస్య కూడా పెరుగుతుంది. ఆకలి తీర్చుకోవడానికి వారు నట్స్, తాజా పండ్లపై ఆధారపడాలి. అలాగే బ్రౌన్ రైస్  వంటి పాలిష్ చేయని బియ్యంతో వండిన ఆహారాలను తినాలి. పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాలు తినాలి. పిండి పదార్థాలు అధికంగా ఉండే బంగాళాదుంపలు వంటివి దూరంగా పెట్టాలి. 


Also read: టీ టైమ్‌లో తినే రస్క్ ఆరోగ్యకరం అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి











































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.