Delta Variant: డెల్టా వేరియంట్ తో భద్రం గురూ!.. ఎక్కువ కేసులు ఇవే!

ABP Desam Updated at: 23 Jul 2021 10:54 AM (IST)

దేశంలో డెల్టా వైరస్ విజృంభిస్తోంది. ప్రస్తుతం నమోదవుతున్న కొత్త కేసుల్లో ఎక్కువ వాట ఈ డెల్టా వైరస్ దే. తాజాగా ఇన్సాకాగ్ నివేదిక ఇదే విషయాన్ని బయటపెట్టింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కరోనా

NEXT PREV

దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజులుగా సగటున రోజుకు 40 వేల కేసులు వస్తున్నాయి. కొత్తగా వస్తోన్న కొవిడ్‌-19 కేసుల్లో డెల్టా రకం వైరస్‌ అత్యధికంగా కనిపిస్తోంది. ఈ వైరస్‌కు సంబంధించిన ఇతర ఆందోళనకర రకాల వ్యాప్తి తక్కువగా ఉంది. 


ఇన్సాకాగ్ నివేదిక..


కరోనా జన్యుక్రమాన్ని గుర్తిస్తున్న ప్రభుత్వ సంస్థల కన్సార్షియం ఇన్సాకాగ్‌ ఈ విషయాన్ని తెలిపింది. డెల్టా ఉప రకాల్లోనూ దీన్ని మించిన శక్తి కలిగిన రకాలు ఉన్నట్లు ఆధారాలేమీ లేవని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని పేర్కొంది. ఆగ్నేయాసియా సహా అనేక ప్రాంతాల్లో కొవిడ్‌ విజృంభణకు ఇదే కారణమవుతోందని తెలిపింది. అయితే వేగంగా టీకాలు వేస్తున్న, బలమైన ప్రజారోగ్య చర్యలు చేపడుతున్న సింగపూర్‌ వంటి చోట్ల పరిస్థితి మెరుగ్గా ఉంటోందని వివరించింది. భారత్‌లో కరోనా రెండో ఉద్ధృతికి డెల్టా వేరియంట్‌ ప్రధాన కారణమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.


నివేదికలో ముఖ్యాంశాలు..



  • టీకా పొందిన వారికీ కరోనా సోకడానికి డెల్టా రకమే ప్రధాన కారణం. అయితే ఇలా సోకినవారిలో 9.8 శాతం మందినే ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం వచ్చింది. వారిలో మరణాలు 0.4 శాతానికే పరిమితమయ్యాయి.

  • వ్యాక్సినేషన్‌ చాలా కీలకం. ప్రజారోగ్య చర్యల వల్ల వ్యాధి వ్యాప్తి తగ్గుతుంది. 

  • భారత్‌లో లాంబ్డా కేసులు లేవు.

  • విదేశీ ప్రయాణికులు, వారికి దగ్గరగా వచ్చినవారిలోనే లాంబ్డా కేసులు ఉన్నాయని బ్రిటన్‌ డేటా సూచిస్తోంది. అయితే డెల్టాతో పోలిస్తే అంత ఉద్ధృతంగా పెరగడం లేదని తెలిపింది.

  • డెల్టాకు సంబంధించి బ్రిటన్‌, అమెరికా, భారత్‌లో అనేక మ్యూటేషన్ లు వచ్చాయి. కె417ఎన్‌ (ఎవై.1/ఏవై.2) కాకుండా కరోనా స్పైక్‌ ప్రొటీన్‌లో ఏ222వీ, కె77టి ఉత్పరివర్తనలు డెల్టా ఉప రకాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రెండింటి వల్ల వ్యాధి వ్యాప్తి మరింత పెరుగుతుందనడానికి గానీ రోగ నిరోధక వ్యవస్థ బోల్తా పడుతుందనడానికి గానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు.


75% వాటా డెల్టాదే..


భారత్‌, చైనా, రష్యా, ఇజ్రాయెల్‌, బ్రిటన్‌ సహా అనేక దేశాల్లో గత నాలుగు వారాల్లో వెలుగు చూసిన కరోనా కేసుల్లో 75 శాతం డెల్టా రకం వల్లే ఉత్పన్నమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది.



"టీకా కార్యక్రమాన్ని విస్తరించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6 ప్రాంతాల్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా వైరస్‌ వేరియంట్లకు సంబంధించి ఆల్ఫా కేసులు 180 దేశాలు, బీటా 130 దేశాలు, గామా 78 దేశాలు, డెల్టా 124 దేశాల్లో బయటపడ్డాయి. డెల్టా రకం సోకినవారికి దగ్గరగా వెళ్లినవారు చాలా తక్కువ సమయంలోనే ఇన్ ఫెక్ట్ అవుతున్నారు"                   -     డబ్ల్యూహెచ్ఓ


 


Published at: 23 Jul 2021 10:54 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.