కార్బెవాక్స్ బూస్టర్‌ డోస్‌కి డీసీజీఐ ఆమోదం 


రెండున్నరేళ్లుగా కరోనా మనల్ని వదలటం లేదు. వరుస వేవ్‌లతో విరుచుకు పడి చాలా భయపెట్టింది. ఈ వైరస్ వల్ల చాలా కుటుంబాలు ఆత్మీయులను కోల్పోయాయి. ఈ పరిస్థితులను గమనించి వెంటనే వ్యాక్సిన్ తయారీలో మునిగిపోయారు శాస్త్రవేత్తలు. ఏడాదిలోనే వైరస్‌కు విరుగుడు కనిపెట్టారు. ఒక్కో సంస్థ క్రమంగా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వ్యాక్సినేషన్
ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల ఒమిక్రాన్ వేరియంట్ వచ్చి అందరినీ భయపెట్టినా అప్పటికే టీకాలు తీసుకోవటం వల్ల ప్రభావం పెద్దగా కనిపించలేదు. బూస్టర్ డోస్ తీసుకుంటే ఇక ఏ చింతా ఉండదని తేల్చి చెప్పారు వైద్యులు. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన సమయంలో చాలా మంది బూస్టర్ డోస్‌లు తీసుకున్నప్పటికీ తరవాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ ఫోర్త్ వేవ్ భయాలు మొదలవుతుండటం వల్ల అందరి దృష్టి బూస్టర్‌ వైపు మళ్లింది. ఈ క్రమంలోనే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా-DCGI మరో కొత్త బూస్టర్ డోస్‌కి అనుమతినిచ్చింది. 18ఏళ్లు పైబడి, రెండు డోసులు తీసుకున్న వారెవరైనా ఈ బూస్టర్ డోస్‌ తీసుకోవచ్చని పేర్కొంది. 


ఆ విషయంలో రికార్డు సృష్టించిన కార్బెవాక్స్


హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమెటెడ్ సంస్థ కార్బెవాక్స్ పేరిట తయారు చేసిన బూస్టర్ డోస్‌ను వినియోగించేందుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. గతంలో కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకాలు తీసుకున్న వాళ్లు కూడా ఈ బూస్టర్ తీసుకోవచ్చని పేర్కొంది డీసీజీఐ. దేశంలో ఈ తరహా అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్‌గా ఘనత సాధించింది కార్బెవాక్స్. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ ఫలితాలను డీసీజీఐకి నివేదించింది బయోలాజిక్ ఈ లిమిటెడ్ సంస్థ. ఈ ఫలితాలను విశ్లేషించిన నిపుణుల బృందం బూస్టర్‌ డోస్‌గా వినియోగించేందుకు అంగీకరించింది. ఈ డోస్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి పెరిగిందని, భద్రత పరంగానూ అన్ని ప్రమాణాలకు తగినట్టుగా ఉందని తేల్చి చెప్పింది. సెకండ్ డోస్ తీసుకున్న వారెవరైనా ఆర్నెల్ల తరవాత ఈ కార్బెవాక్స్ బూస్టర్ డోస్ తీసుకోవచ్చు.


బూస్టర్ డోస్‌ల అవసరాలు తీర్చుతాం: బీఈ సంస్థ ఎమ్‌డీ మహిమ దాట్ల


డీసీజీఐ నిర్ణయంపై హర్షం  వ్యక్తం చేశారు బయోలాజికల్ ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల. దేశంలో బూస్టర్ డోస్‌ల అవసరాలు తీర్చే అవకాశం తమ సంస్థకు దొరికిందని అన్నారు. ఈ అనుమతితో మరోసారి తమ సంస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తోందని రుజువైందని చెప్పారు.  ఇప్పటికే 12-17 ఏళ్ల పిల్లలకు కార్బెవాక్స్ టీకాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 50 లక్షల డోసులు అందించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకూ 10కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేసింది బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ.