యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌కి అంతా సిద్ధం


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్-UPSC ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి అంతా సిద్ధమైంది. జూన్ 5న ఈ పరీక్ష నిర్వహించనుంది యూపీఎస్‌సీ. ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. ఎగ్జామ్‌హాల్‌కి వచ్చే ముందు ప్రతి ఒక్కరూ ఈ అడ్మిట్ కార్డ్‌ని ప్రింట్ తప్పనిసరిగా తీసుకుని రావాలని స్పష్టం చేసింది యూపీఎస్‌సీ. రెండు స్లాట్‌ల వారీగా ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ జరగనుంది. ఉదయం 9.30 నుంచి 11.30 వరకూ ఓ స్లాట్ కాగా, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకూ మరో స్లాట్‌గా నిర్ణయించారు. ఎగ్జామ్ సెంటర్, స్లాట్ వివరాలు అడ్మిట్‌ కార్డులోనే ఉంటాయి. ఇక ఈ ఎగ్జామ్‌కి ఏమేం తీసుకెళ్లాలి..? హాల్‌లోకి ఏవి అనుమతిస్తారు..? ఏవి అనుమతించరు అని రకరకాల సందేహాలు వస్తాయి. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా చాలా స్పష్టంగా అన్ని వివరాలు అందించింది యూపీఎస్‌సీ. 


అవసరమైన డాక్యుమెంట్లు


1. యూపీఎస్‌సీ జారీ చేసిన ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి
2. ఫోటో ఐడీ ప్రూఫ్
3. యూపీఎస్‌సీ అడ్మిట్‌ కార్డ్‌పై ఫోటో సరిగా లేకపోతే అభ్యర్థులు కచ్చితంగా ఫోటో ఐడీ ప్రూఫ్‌ని తీసుకెళ్లాలి. వాటితో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలూ క్యారీ చేయాలి. 
4.ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకపోతే ఎగ్జామ్‌ రాసేందుకు అంగీకరించరు. అందుకే ఈ విషయం గుర్తు పెట్టుకుని అవసరమైన డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలి


హాల్‌లోకి ఇవి అనుమతించరు:  


1. యూపీఎస్‌సీ పరీక్ష రాసే అభ్యర్థి మొబైల్, బ్లూటూత్, పెన్‌డ్రైవ్స్‌ లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను హాల్‌లోకి తీసుకెళ్లకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే 
పరీక్ష రాసేందుకు అనుమతించరు. 
2. సాధారణ రిస్ట్ వాచ్‌లు మాత్రమే పెట్టుకోవాలి. స్మార్ట్‌ వాచ్‌లను అనుమతించరు. 
3. కచ్చితంగా బ్లాక్‌ బాల్ పాయింట్ పెన్‌ మాత్రమే తీసుకెళ్లాలి. వేరే ఏ ఇంక్‌ పెన్‌తో సమాధానాలు మార్క్‌ చేసినా వాటిని లెక్కలోకి తీసుకోరు. 
4. విలువైన వస్తువులను హాల్‌లోకి తీసుకెళ్లకూడదు. ఒకవేళ అవి పోయినా అందుకు యూపీఎస్‌సీ బాధ్యత వహించదు. అందుకే సాధ్యమైనంత వరకూ 
అనవసరమైన వస్తువులు హాల్‌ లోపలకు తీసుకురాకూడదని స్పష్టంగా చెప్పింది యూపీఎస్‌సీ. 
5. సానిటైజర్ బాటిల్స్‌ని ఎవరికి వారే తీసుకెళ్లాలి. 
 
కట్టుదిట్టమైన భద్రత


దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలేవి అంటే యూపీఎస్‌సీ ఎగ్జామ్స్ అని ఠక్కున సమాధానం చెబుతారు అభ్యర్థులు. పరీక్ష నిర్వహణలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తారు. పరీక్ష పూర్తైన 25-30 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారే మెయిన్స్‌ పరీక్ష రాయటానికి అర్హులు.