Maharashtra COVID Restrictions : దేశంలో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర అదనపు చీఫ్‌ సెక్రటరీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైళ్లు, సినిమాలు, బస్సులు, ఆడిటోరియంలు, ఆఫీసులు, ఆసుపత్రులు, కాలేజీలు, స్కూళ్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. టెస్టింగ్‌, ట్రాకింగ్‌ను వేగవంతం చేయాలని జిల్లా అధికారులకు సూచించింది. మహారాష్ట్రలో ఇటీవల బీఏ.4, బీఏ.6 సబ్‌ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది.


 మళ్లీ పెరుగుతున్న కేసులు 


జూన్‌ 1వ తేదీన మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదు అయింది. మూడు నెలల తర్వాత తొలిసారి మళ్లీ వెయ్యికి పైగా కేసులు నమోదు అయ్యాయి. ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌తో పాటు, థానే ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగా ఉంటడంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,134 కొత్త కేసులు నమోదు అవ్వగా, మూడు మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబాయిలో 763 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసులు 5 వేలు దాటాయి.


నియంత్రణలోనే కరోనా 


గత వారంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. అంతకు ముందు వారంతో పోల్చితే కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా నియంత్రణలోనే ఉందని, ఆసుపత్రిలో అడ్మిషన్లను కనిష్టంగా ఉన్నాయని వైద్యాధికారులు పేర్కొ్న్నారు. కరోనా నియంత్రణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అదనపు చీఫ్ సెక్రటరీ, డాక్టర్ వ్యాస్ అన్నారు. “మహారాష్ట్రలో ఇటీవల BA.4, BA.5 సబ్‌వేరియంట్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేనప్పటికీ, ఏదైనా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాం" -డా.వ్యాస్ అన్నారు.  


కేరళ, మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి


 సోనియా, ప్రియాంకా గాంధీలకు కరోనా వైరస్ సోకిందన్న వార్త బయటకు వచ్చిన తర్వాత దేశంలో మళ్లీ కరోనా వైరస్‌పై చర్చ పెరిగింది. అంత వీఐపీలకే కరోనా సోకితే మిగతా వారి పరిస్థితేంటి అన్న చర్చ కూడా వచ్చింది. దానికి తగ్గట్లుగానే  దేశంలో మళ్లీ కోవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రియాశీల కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. కేరళ, మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం కొత్త కేసులు, బాధితుల సంఖ్యపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కోవిడ్‌ క్రియాశీల కేసులు 19 వేల మార్కు దాటాయి.