కాన్పూర్‌ అల్లర్ల కేసులో 36 మంది అరెస్ట్ 


యూపీలోని కాన్పూర్ అల్లర్ల కేసులో 36 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.  సున్నితమైన ప్రాంతాల్లో పోలీస్ పహారా పటిష్ఠం చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా హెచ్చరించారు. యతీమ్ ఖానా, పరేడ్ జంక్షన్స్ ప్రాంతాల్లో భద్రత పెంచినట్టు తెలిపారు. ఎవరెవరు ఈ గొడవలకు కారణమయ్యారో తమ వద్ద వీడియో ఆధారాలున్నాయని, గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేస్తామని కమిషనర్ వెల్లడించారు. 


అల్లర్లు ఆపకుంటే బుల్‌డోజర్లతో వెళ్లండి: సీఎం యోగి ఆదేశాలు 


మార్కెట్ మూసివేసే విషయంలో తలెత్తిన గొడల చినికి చినికి గాలి వానలా మారింది. భాజపా నేత మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతర వ్యాఖ్యలు చేయటంపై ఆ వర్గ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్కెట్‌ మూసి వేయాలంటూ ఓ వర్గానికి చెందిన వారు డిమాండ్ చేయగా మరో వర్గం ఇందుకు అంగీకరించలేదు. ఫలితంగా ఒక్కసారిగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ మొదలైంది. పరేడ్, నయీ సడక్, యతీమ్‌ఖానా ప్రాంతాల్లో శుక్రవారం తీవ్ర స్థాయిలో దాడి చేసుకున్నాయి ఇరు వర్గాలు. ఈ క్రమంలో కొందరు బాంబులు కూడా విసురుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. రాళ్ల దాడిలో పలువురు పోలీసులకూ గాయాలయ్యాయి. ఓ టీవీ షో వేదికగా భాజపా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బ తీశాయంటూ స్థానిక ముస్లిం సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. అనవసరంగా గొడవలకు దిగారని ఆరోపిస్తూ మార్చ్ కూడా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనకు ముందు ఇలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం వల్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఈ అల్లర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ దాడుల వెనక ఎవరున్నా సహించకూడదని, కఠినంగా శిక్షించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్-NSA కింద కఠిన చర్యలు తీసుకోవాలని, అల్లర్లకు కారణమైన వారి ఆస్తులు సీజ్ చేయాలని ఆదేశించారు యోగి ఆదిత్యనాథ్. బుల్‌డోజర్లు వినియోగించైనా సరే పరిస్థితులు అదుపులోకి తీసుకురావాలని కాస్త గట్టిగానే చెప్పారు యోగి. పోలీసుల జోక్యంతో అల్లర్లు అదుపులోకి వచ్చినప్పటికీ..సామాజిక మాధ్యమాల్లో ఈ ఘర్షణ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి విధ్వంసం జరగకుండా పహారాను పటిష్ఠం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలగకూడదన్న సీఎం ఆదేశాల మేరకు భద్రత పెంచారు.