Airtel Payments Bank partners with Muthoot Finance to offer gold loans : గోల్డ్ లోన్ కోసం చూస్తున్నారా? తక్కువ వడ్డీకే కావాలా? ప్రాసెసింగ్ ఫీజు లేకుంటే మరీ మంచిదా? అయితే మీ దగ్గర ఈ యాప్ ఉంటే చాలు! అత్యంత సులభంగా బంగారంపై రుణం పొందొచ్చు.
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ (Airtel Payments Bank) ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ (Airtel Thanks App) ద్వారా గోల్డ్ లోన్లు ఆఫర్ చేస్తోంది.
ఎయిర్ టెల్ థాంక్స్ యాప్ ద్వారా బంగారంపై రుణాలు పొందితే ప్రాసెసింగ్ ఫీజూ ఉండదు. పైగా మీరు తనఖా పెట్టిన బంగారంలో 75 శాతం విలువ మేరకు ముత్తూట్ ఫైనాన్స్ రుణం మంజూరు చేస్తుందని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది.
'గోల్డ్ లోన్స్ సురక్షితమైన రుణాల విభాగంలోకి వస్తాయి. వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా కస్టమర్ల అవసరాలను తీరుస్తాయి. చాలా రకాలుగా ఆదుకుంటాయి. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా సులభంగా గోల్డ్ లోన్స్ మంజూరు చేసేందుకు మేం ముత్తూట్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం' అని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గణేశ్ అనంత నారాయణన్ తెలిపారు. ఈ రుణ సౌకర్యం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఐదు లక్షల బ్యాంకింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉందన్నారు.
'మా భాగస్వామ్యం ద్వారా కస్టమర్లు తమ బంగారంపై సులభంగా, తక్కువ వడ్డీకే సురక్షితంగా రుణాలు పొందగలరు. దేశంలోని వేర్వేరు నగరాల్లోని ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు మేం సంతోషంగా ఉన్నాం' అని ముత్తూట్ ఫైనాన్స్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ అలెగ్జాండర్ జార్జ్ ముత్తూట్ అన్నారు.
దరఖాస్తు ప్రక్రియ ఇదీ!
* మొదట ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
* ఆపై బ్యాంకింగ్ సెక్షన్‌లోకి వెళ్లండి.
* ఆ తర్వాత గోల్డ్ లోన్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి. ప్రాంతం, రుణ మొత్తం, కాల పరిమితి ఎంచుకోవాలి.
* ముత్తూట్ ఫైనాన్స్‌తో సమాచారం పంచుకొనేందుకు అనుమతించాలి.
* ఆపై ముత్తూట్ ఫైనాన్స్ నుంచి మీకు కాల్ వస్తుంది.