EPFO e-nomination: వ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఈపీఎఫ్‌ సుపరిచితమే! కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఏటా వడ్డీరేటును నిర్ణయిస్తుంది. నిధులను స్టాక్‌ మార్కెట్లు, ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టడంపై సమాలోచనలు చేస్తుంటుంది. ఫలితంగా ఉద్యోగులకు రిటైర్మెంట్‌ ప్రయోజనాలు అధిక మొత్తంలో లభిస్తాయి.


ఉద్యోగులంతా ఈపీఎఫ్‌ ఈ-నామినేషన్‌ పూర్తి చేసుకోవాలని చాలా రోజుల్నుంచి ఉద్యోగ భవిష్యనిధి సంస్థ చెబుతోంది. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తోంది. లేదంటే చాలా వరకు ప్రయోజనాలను కోల్పోతారని హెచ్చరిస్తోంది. చాలా మంది ఈ-నామినేషన్‌ పూర్తి చేద్దామని వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయితే ఓ సమస్య ఎదురవుతోంది. 'అనేబుల్‌ టు ప్రొసీడ్‌' అనే ఆప్షన్‌ ఇబ్బంది పెడుతోంది. పరిష్కారంగా ఏం చేయాలో అర్థమవ్వడం లేదు. అయితే ప్రొఫైల్‌ ఫొటోను మీ ఖాతాకు జత చేస్తే వెంటనే పని జరుగుతుందని తాజాగా తెలిసింది.


మీ ఈపీఎఫ్‌వో మెంబర్‌ ఐడీకి కచ్చితంగా ప్రొఫైల్‌ ఫొటో ఉండాలి. అప్పుడే ఈ-నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ప్రొఫైల్‌ ఫొటో లేకుండా ఈ నామినేషన్‌ పూర్తి చేయాలని ప్రయత్నిస్తే ఇబ్బంది పడక తప్పదు. 'అనేబుల్‌ టు ప్రొసీడ్‌' అనే ఎర్రర్‌ మెసేజ్‌ వస్తుంది. ఈపీఎఫ్‌ యూఏన్‌ (EPF UAN) పోర్టల్‌లో ప్రొఫైల్‌ ఫొటో జత చేయాలంటే ఈ కింది ప్రాసెస్‌ను పాటించాలి.


ఫొటో ఎలా ఉండాలంటే


* డిజిటల్‌ కెమేరా నుంచి తీసిన చిత్రమే అప్‌లోడ్‌ చేయాలి.
* అప్‌లోడ్‌ చేసే ముందు ఆ చిత్రాన్ని 2.5 x 4.5 సెంటీమీటర్ల పొడవు, వెడల్పుగా క్రాఫ్‌ చేయాలి.
* ఆ ప్రొఫైల్‌ పిక్‌లో 80 శాతం వరకు ముఖం, రెండు చెవులు కనిపించాలి. 
* జేపీఈజీ, జేపీజీ, పీఎన్‌జీ ఫార్మాట్లో ఉండాలి.
* అప్‌లోడ్‌ చేసే ఫొటో 100 కేబీకి మించి పెద్దదిగా ఉండొద్దు.


ఫొటో అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ


* మొదట యూఏఎన్‌ ఖాతాకు లాగిన్‌ అవ్వాలి.
* మెనూ సెక్షన్‌లో 'వ్యూ'ను సెలక్ట్‌ చేసుకోవాలి. డ్రాప్‌ డౌన్‌ మెనూలో 'ప్రొఫైల్‌'ను ఎంపిక చేసుకోవాలి.
* ఎడమవైపు ఫొటో ఛేంజ్‌ను క్లిక్‌ చేయాలి.
* మీ మొబైల్‌ లేదా కంప్యూటరర్లో అడ్జస్ట్‌ చేసిన ఫొటోను సెలక్ట్‌ చేయాలి. ప్రివ్యూ బటన్‌ క్లిక్‌ చేసి, ఆ తర్వాత అప్‌లోడ్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.
* ప్రివ్యూ చూసిన ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. దాంతో మీ  ప్రొఫైల్‌ పిక్‌ సెట్‌ అవుతుంది.


ఆన్‌లైన్‌లో EPF నామినేషన్ చేసుకునే విధానం
(how to file EPF nomination online)


- ఈపీఎఫ్ ఖాతాదారులు అధికారిక EPFO వెబ్‌సైట్‌కు వెళ్లాలి లేదా epfindia.gov.inలో క్లిక్ చేయాలి.
- హోం పేజీలో కనిపించిన ఆప్షన్లలో ‘ Service’ 'సేవ'పై క్లిక్ చేయండి
- దీని తర్వాత ఉద్యోగుల కోసం అని సూచించే  ‘For Employees’ ఆప్షన్ ఎంచుకోండి
- ‘మెంబర్ UAN/ ఆన్‌లైన్ సర్వీస్ (OCS/OTP) (Member UAN/ Online Service (OCS/OTP)పై క్లిక్ చేయండి
- మీ UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి
- ‘Manage Tab’ కింద ‘E-nomination’ మీ క్లిక్ చేయాలి 
-  ‘Provide Details’  కనిపిస్తే మీ వివరాలను నమోదు చేయండి. తరువాత 'సేవ్' ఆప్షన్ పై క్లిక్ చేయండి
- కుటుంబ సభ్యుల వివరాల(family declaration)ను అప్‌డేట్ చేయడానికి ‘Yes’ ఎంచుకోవాలి
- కుటుంబ సభ్యుల వివరాలు అప్‌డేట్ చేయడానిక ‘Add Family Details’పై క్లిక్ చేసి, వివరాలు నమోదు చేయాలి. ఒకరి కంటే ఎక్కువ నామినీలను యాడ్ చేసుకోవచ్చు.
- ‘Nomination Details’పై క్లిక్ చేసి ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే వారి షేర్ ఎంతో నమోదు చేసి సేవ్ ఈపీఎఫ్ నామినేషన్ పై క్లిక్ చేయాలి
- ‘E-sign’ ఆప్షన్ ఎంచుకుంటే.. మీ ఆధార్ నంబర్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. 


ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయితే ఈపీఎఫ్ ఈ నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లే. ఈపీఎఫ్ ఖాతాదారుడు తమ కంపెనీకి గానీ గతంలో పనిచేసిన ఆఫీసులో గానీ ఎలాంటి డాక్యుమెంట్ సమర్పించాల్సిన అవసరం లేదు.