దాల్చిన చెక్క వంటగదిలో ఉపయోగించే ఒక సాధారణమైన మసాలా దినుసు. కూరల్లో రుచి, వాసన కోసం దీనిని ఉపయోగిస్తారు. దీని వల్ల ఆరోగ్యపరమైన లాభాలు చాలా ఉన్నాయి. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సాయం చేస్తుంది. మెదడు చురుకుగా ఉండటానికి, మతిమరపుకు చెక్ పెట్టడానికి కూడా సహకరిస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ మన శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. 
అయితే దాల్చిన చెక్కను అతిగా తీసుకుంటే దుష్ఫభావాలు కూడా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. దీనిని ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలంలో ముప్పు తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
కాలేయానికి హానికరం.. 
దాల్చిన చెక్కను అతిగా వాడటం వల్ల కాలేయం దెబ్బతింటుందని పరిశోధనల్లో తేలింది. దీనిలో ఉండే కొమారిన్ (coumarin) అనే భాగాన్ని అవసరమైన దాని కంటే మించి తీసుకోవడం వల్ల లివర్ విషపూరితం అవుతుందని వెల్లడైంది. 
లోబీపీ వచ్చేలా చేస్తుంది..
టైప్ 2 డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుందని నమ్ముతారు. కానీ దీనిని అధికంగా వాడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా అమాంతం పడిపోయే ప్రమాదం ఉంది. అలాగే బీపీ లెవెల్స్ కూడా తగ్గుతాయి. సాధారణంగా బీపీ స్థాయి పడిపోవడాన్ని హైపోగ్లైసీమియా (hypoglycemia) అంటారు. దీని వల్ల మైకం, మత్తు వంటివి వస్తాయి. దాల్చిన చెక్క ఎక్కువగా వాడటం వల్ల హైపోగ్లైసీమియా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మీ అవయవాలు పనిచేయకుండా చేయగల శక్తి కూడా దీనికి ఉంది. అందువల్ల, డయాబెటిక్ పేషెంట్లు దాల్చిన చెక్కను తమ డైలీ రొటీన్‌లో చేర్చే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం ఉత్తమం. 
అల్సర్లు, కేన్సర్ వ్యాధులకు కారణం..
దాల్చిన చెక్కను ఎక్కువగా వాడటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కొంతమందికి కడుపులో మంట వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ కాలం ఇలా కొనసాగితే ఇది అల్సర్లు, క్యాన్సర్ వ్యాధులకు కారణమవుతుంది. అలాగే దాల్చిన చెక్కలో ఉండే సిన్నమాల్డిహైడ్ ఆర్గానిక్ కాంపౌండ్ నోటి అల్సర్లకు ప్రధాన కారణమని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. దీనిని ఎక్కువగా తీసుకున్న వారిలో చిగుళ్ల మంటలు, నాలుకపై పొక్కులు, దురద వంటివి వచ్చాయని వెల్లడైంది.  
ఇలాంటి వాళ్లు దాల్చిన చెక్కకు దూరంగా ఉండండి.. 
నోటి పూతతో బాధపడేవాళ్లు దాల్చిన చెక్క తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్లు కూడా దాల్చిన చెక్క వినియోగాన్ని పరిమితం చేయాలి. దాల్చిన చెక్కలో ఉండే గుణాలు దగ్గు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి దీనిని వాడేటప్పుడు ఆస్తమా రోగులు జాగ్రత్తగా ఉండాలి.