కొవిడ్ 19 థర్డ్ వేవ్ వస్తుందా? వస్తే ఎప్పుడు వస్తుంది..? అనే ప్రశ్నలకు పలు సర్వేలు, అధ్యయనాలు ఇప్పటికే పలు సమాధానాలిచ్చాయి. అయితే ఐసీఎమ్ఆర్ సహా అత్యధిక సర్వేలు ఆగస్ట్ చివరి వారంలో కరనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. భారత్ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందా?
అయితే కరోనా థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ అంత స్థాయిలో ఉండకపోవచ్చని ఐసీఎంఆర్ అంచనా వేస్తోంది. అయినప్పటికీ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ముందుగా సూపర్ స్ప్రెడర్లు సరైన జాగ్రత్తలు పాటించాలని ఐసీఎంఆర్ సూచించింది.
థర్డ్ వేవ్ విజృంభిస్తుందా..
శరీరంలో ఇమ్యూనిటీ తగ్గడం, కొత్త వేరియంట్లు రావడం, లాక్ డౌన్ సడలింపులు వంటి వాటి వల్ల థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఎక్కువ ఉంది. ఇంతకుముందు కరోనా సోకిన వారు వ్యాక్సిన్ వేసుకోకపోతే వారిలో కరోనాతో పోరాడే రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
వ్యాక్సిన్ లు పనిచేస్తున్నాయి..
ప్రపంచ దేశాల్లో థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ వ్యాక్సిన్స్ పనిచేయడం వల్ల ఆసుపత్రిలో చేరే వారి రేటు తగ్గింది. ఒక వేళ కొత్త వేరియంట్లు వచ్చినప్పటికీ వ్యాక్సిన్స్ వాటిపైనా సమర్థంగా పనిచేస్తాయని ఐసీఎమ్ఆర్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రస్తుత పరిస్థితి..
మొత్తంగా దేశంలో కరోనా పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు థర్డ్ వేవ్ పై ప్రజలను హెచ్చరిస్తూనే ఉంది. గుంపులు గుంపులుగా ఉండటం, మాస్కు ధరించకుండా తిరగడం వంటి వాటి వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐసీఎమ్ఆర్.
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే పలు సర్వేలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉంది.