Abhijeet Dipke Diagnosed with Typhoid : వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు రావడం సర్వసాధారణం. అయిది ఇది మామూలు జ్వరం అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సకాలంలో చికిత్స అందకపోతే అనారోగ్యం తీవ్రత పెరగవచ్చు. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ తనకు టైఫాయిడ్ వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

Continues below advertisement

తన బ్లడ్ టెస్టులో టైఫాయిడ్ నిర్ధారణ అయిందని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం IV (ఇంట్రావీనస్) ద్వారా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. టైఫాయిడ్ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలు ఏమిటి. ఈ వ్యాధి ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో ఒక్కడ తెలుసుకుందాం.

టైఫాయిడ్ అంటే ఏంటీ.. ఎలా వస్తుంది ?

Continues below advertisement

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ (Salmonella Typhi) బ్యాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియా ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది వేగంగా రక్తంలో వ్యాపించి ఇన్ఫెక్షన్‌ను వేగంగా పెంచుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.1 కోట్ల నుండి 2.1 కోట్ల మంది టైఫాయిడ్‌ బారిన పడుతున్నారు. దాదాపు 2 లక్షల మంది ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల పారాటైఫాయిడ్ కేసులు సైతం నమోదవుతాయి. వీటిలో ఎక్కువ కేసులు దక్షిణాసియాలో నమోదవుతున్నాయి. 

టైఫాయిడ్ లక్షణాలు ఏమిటి?

టైఫాయిడ్ ప్రారంభ లక్షణాలు సాధారణంగా బ్యాక్టీరియా సోకిన 10 నుండి 14 రోజుల తర్వాత కనిపిస్తాయి. పేషెంట్ కి తీవ్రమైన జ్వరం వస్తుంది. దీంతో పాటు తలనొప్పి, అలసట, కడుపు నొప్పి, వికారం, వాంతులు, బలహీనత, ఆకలి తగ్గడం, మలబద్ధకం లేదా అతిసారం, కండరాల నొప్పి, శరీరంపై దద్దుర్లు లాంటి లక్షణాలు ఉంటాయి. చికిత్స చేయకపోతే, ఈ వ్యాధి 3 నుండి 4 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటుంది. 

Also Read: Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు

టైఫాయిడ్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?

సకాలంలో చికిత్స అందకపోతే టైఫాయిడ్ సమస్య పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాధి వివిధ దశలలో రోగికి తీవ్రమైన జ్వరం, కడుపు ఉబ్బరం, వేగంగా బరువు తగ్గడం, డీహైడ్రేషన్, డెలిరియం, అంతర్గత రక్తస్రావం, మెదడు వాపు, ప్రేగులకు తీవ్రమైన గాయం, కిడ్నీ ఫెయిల్యూర్, న్యుమోనియా, ప్యాంక్రియాస్‌లో వాపు, మెనింజైటిస్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక కొన్ని రోజులపాటు తీవ్రమైన జ్వరం లేదా ఇతర తీవ్రమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

టైఫాయిడ్‌లో IV ఎందుకు ఇస్తారు?

టైఫాయిడ్ తీవ్రమైన కేసులలో రోగి శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఏర్పడవచ్చు. ఆ సందర్భాలలో, IV ద్వారా శరీరంలోకి ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు ఇస్తారు. IV ద్వారా మందులు నేరుగా రక్తప్రవాహంలోకి చేరి త్వరగా ప్రభావం చూపుతాయి. ఈ కారణంగానే చాలా మంది రోగుల చికిత్సలో IV థెరపీని ఉపయోగిస్తారు. 

టైఫాయిడ్‌ను ఎలా గుర్తిస్తారు?

ఒక వ్యక్తిలో టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే, డాక్టర్లు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. దీని కోసం బ్లడ్ టెస్ట్, టైఫీ డాట్ టెస్ట్, బ్లడ్ కల్చర్, స్టూల్, యూరిన్ టెస్ట్, విడాల్ టెస్ట్  వంటి పరీక్షలు చేస్తారు. కొన్ని కేసులలో యాంటీబయాటిక్ మందుల తర్వాత కూడా కోలుకోకపోతే బోన్ మ్యారో కల్చర్ చేయించుకోవాలని సూచిస్తారు. 

టైఫాయిడ్ నుండి ఎలా రక్షించుకోవాలి?

టైఫాయిడ్ నుండి రక్షించుకోవడానికి శుభ్రమైన, సురక్షితమైన నీటిని తాగాలి. బాగా వండిన, తాజా ఆహారాన్ని తినాలి. తినడానికి, తయారు చేయడానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం, రోడ్డు పక్కన బహిరంగంగా ఉంటే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇంటి చుట్టూ పరిశుభ్రతను పాటించాలి. టైఫాయిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే ముందు, డాక్టర్ సలహా మేరకు టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా వేయించుకోవచ్చు.  

Disclaimer: ఈ సమాచారం పరిశోధనా అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా భావించవద్దు. ఏదైనా కొత్త వ్యాయామాన్ని ప్రారంభించే ముందు, మెడిసిన్ వాడే ముందు మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుడిని తప్పకుండా సంప్రదించండి.