ఎంతోమందికి ఉండే అపోహ ఏంటంటే రుతుస్రావం సమయంలో బయటికి పోయే రక్తం చెడు రక్తం అని అనుకుంటారు. శరీరంలో చెడు రక్తం. మంచి రక్తం అనే రెండు రకాలు ఉండవు. ఉండేదంతా మంచి రక్తమే. బ్లీడింగ్ సమయంలో కూడా పోయేది శరీరంలో అవయవాలకు ప్రవహించే మంచి రక్తమే. కొందరి మహిళల్లో మూడుకు మించి ఐదు రోజులు, ఏడు రోజులు పాటు బ్లీడింగ్ అవుతుంది. దీనివల్ల చాలా మేరకు ఒంట్లోని రక్తం బయటికి పోతుంది. అందుకే వారు త్వరగా రక్తహీనత సమస్య బారిన పడతారు. ఇలాంటి వాళ్లు చాలా నీరసంగా ఉంటారు. వారికి త్వరగా అలసట వచ్చేస్తుంది. అంతేకాదు ఏ పని చేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నీరసంగానే ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలియక ఇబ్బంది పడతారు. రుత క్రమ సమయంలో  అధికంగా బ్లీడింగ్ అయ్యే వాళ్ళు తప్పకుండా తమ శరీరంలో రక్తం ఎంతుందో తెలుసుకునే పరీక్ష చేయించుకోవాలి. అందులో ఎనీమియా అంటే రక్తహీనత సమస్య బయటపడితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 


ఏం తినాలి?
శరీరంలోని రక్తం పెరగాలంటే ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. అలాగే సులభంగా జీర్ణం అయ్యే ఆహారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ముదురాకు పచ్చగా ఉండే ఆహారాలు తినడం వల్ల రక్తం పరిమాణం పెరుగుతుంది. అంటే పాలకూర, బచ్చలి కూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు ఎక్కువగా తినాలి. సీజనల్‌గా దొరికే పచ్చి బఠానీలు కూడా ఆ సీజన్లో అధికంగా తినాలి. చిక్కుళ్ళు తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. క్యారెట్, బీట్రూట్ దుంపలు రక్తం అధికంగా పట్టడానికి తోడ్పడతాయి. కాబట్టి ఈ రెండింటిని మిక్సీలో వేసి జ్యూస్‌గా తీసి రోజూ ఉదయం తాగితే త్వరగా ఎనీమియా నుంచి కోలుకుంటారు. అలా తాగలేము అనుకున్న వాళ్ళు వీటిని రోజు వండుకునైనా తినాలి. అలాగే మాంసాహారం తినేవారు కాలేయం, గుడ్లు తీసుకోవడం వల్ల వారికి హిమోగ్లోబిన్ అధికంగా చేరుతుంది. వాటిలో హీమ్ అనే ఐరన్ ఉంటుంది. దీని వల్ల రక్తం ఉత్పత్తి అవుతుంది. ఇక డ్రై ఫ్రూట్స్‌లో ఎండు ఖర్జూరం, బాదం రక్త ఉత్పత్తికి సహకరిస్తాయి. బయట దొరికే పల్లి పట్టి లాంటి వాటిలో కూడా ఐరన్ అధికంగా ఉంటాయి. కాబట్టి అవి కూడా రక్తాన్ని ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తాయి. రోజు గోరువెచ్చని నీళ్ళు, రెండు స్పూన్ల తేనె వేసుకుని తాగిన మంచి ఫలితం ఉంటుంది. బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి రోజు చిన్న ముక్క బెల్లం తింటే మంచిది. అయితే డయాబెటిస్ ఉన్న మహిళలు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఇందులో పైన చెప్పిన ఆహారంలో వేటిలో చక్కెర తక్కువగా ఉందో వాటిని మాత్రమే తినాలి. 


రక్తహీనత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. తీవ్ర స్థాయిలో ఉన్న వారు ఆహారం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడటం కష్టం. అలాంటి వాళ్ళు వెంటనే వైద్యులను సంప్రదించి దానికి తగిన చికిత్స తీసుకోవాలి. ఒక మోస్తరుగా ఉన్నవారు, సాధారణంగా ఉన్న వారు ఆహారంలో మార్పులు ద్వారా త్వరగా ఆ సమస్య నుంచి బయటపడగలరు. అవసరమైతే వైద్యులు ఐరన్ మాత్రలు ఇస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే రక్తం ఎక్కించడం వంటి చికిత్సలు కూడా చేస్తారు. 


Also read: ప్రపంచంలోని మొట్టమొదటి రోబోట్ లాయర్ - త్వరలో కోర్టులో వాదించబోతోంది



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.