నోటి దుర్వాసన వస్తే మీ పక్కన ఎవరూ కూర్చోవడానికి ఇష్టపడరు. మీతో మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించరు. మీకు దూరంగా జరిగిపోతారు. కాబట్టి నోటి దుర్వాసనను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నోటిని శుభ్రంగా ఉంచుకోనప్పుడు నోటి దుర్వాసన సమస్య మొదలవుతుంది. ఈ సమస్య కాలక్రమేనా పెరుగుతుంది. నోరు పొడిబారి పోవడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టాన్సిలైటిస్, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తులు లేదా గొంతు ఇన్ఫెక్షన్ వల్ల నోటి దుర్వాసన కలుగుతుంది. సాధారణంగా నోటి దుర్వాసన వేధిస్తుంటే ఆయుర్వేదంలో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు చిట్కాలు ఉన్నాయి.
మౌత్ వాష్
ఆయుర్వేదంలో నోటి దుర్వాసనను దూరం చేసేందుకు కషాయాన్ని తయారు చేస్తారు. ఆ కషాయాలను తాగడం ద్వారా నోటిని శుభ్రపరచుకోవచ్చు. ఈ మౌత్ వాష్‌ను అశ్వగంధ, అల్లం, పిప్పలి, అమలకి, తులసి, బ్రహ్మీ కలిపి చేస్తారు. దీన్ని కొని పెట్టుకుంటే రోజుకు రెండు మూడు సార్లు దీంతో నోరు పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన సమస్య దూరం అవుతుంది.
లవంగం, యాలకుల డికాషన్
ప్రతి ఇంట్లోనూ లవంగాలు, యాలకులు ఉంటాయి. రెండు గ్లాసుల నీటిలో అల్లం, లవంగం, యాలకులు వేసి మరిగించాలి. అలా మరిగినప్పుడు నీరు సగానికి తగ్గిపోతుంది. ఆ సమయంలో ఆ నీటిని వడకాచి క్లాసులో పోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచి పరిష్కారం లభిస్తుంది.
త్రిఫల
ఉసిరి, మైరోబాలన్, విభీతకి మూలికలతో తయారైన పదార్థాన్ని త్రిఫల అంటారు. దీనిలో విటమిన్ సి, ఫ్రక్టోస్, లినోలిక్ ఆమ్లం ఉంటాయి. త్రిఫల పొడిని వేడి నీటిలో మరిగించి ఆ నీటితో రోజుకు రెండుసార్లు నోరు పుక్కించడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి దీన్ని నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సిన్నమిక్ అల్టిహైడ్ అనే మూలకం దాల్చిన చెక్కలో ఉంటుంది. నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క నీటిలో వేసి మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తూ ఉండాలి.
వేప
పూర్వం వేప పుల్లతోనే బ్రష్ చేసేవారు. అందుకే వారికి నోటి దుర్వాసన, పళ్ళ సమస్యలు తక్కువగా వచ్చేవి. ఇప్పుడు నోటు దుర్వాసన పోవాలంటే, వేప పుల్లతో రోజూ బ్రష్ చేయండి లేదా వేప పొడిని పేస్ట్‌లో కలిపి దాంతో బ్రష్ చేయండి. వేపలో యాంటీ వైరల్, యాంటీ మైక్రో బయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వేపతో పాటు కలబందను కూడా ఉపయోగించవచ్చు. కలబంద రసంతో నీళ్లు కలిపి పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
Also read: పిల్లలు పరగడుపునే ఖాళీ పొట్టతో తినాల్సిన ఐదు ఆహారాలు ఇవే, తింటే వారి ఆరోగ్యానికి తిరుగులేదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.