వాతావరణంతో పాటు వచ్చే రోగాల్లో ముఖ్యమైనవి జలుబు, దగ్గు, జ్వరం, అలెర్జీలు. వీటిలో అతి సాధారణంగా జలుబు, దగ్గు ఎక్కువ మందిని ప్రభావితం చేస్తాయి. మార్కెట్లో దొరికిన దగ్గు సిరప్‌లనే ఎక్కువ మంది వినియోగిస్తారు. అయితే పూర్వం ఈ దగ్గు సిరప్‌లు ఏవి ఉండేవి కాదు. వారు ఇంట్లోనే దగ్గుకు ఔషధాన్ని తయారు చేసుకొని తాగేవారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇది తయారైపోతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ ఉండవు. కాబట్టి సహజ పద్ధతిలో మీరు కూడా ఇంట్లోనే ఇలా దగ్గు సిరప్ తయారు చేసుకొని తాగితే మంచిది.


ఇంట్లోనే దగ్గు ఔషధం తయారీకి ఐదు పదార్థాలు కావాలి. తేనే, మిరియాలు, తులసి, అల్లం, నిమ్మకాయ వంటి వాటితో ఈ ఔషధాన్ని తయారు చేస్తారు. వీటన్నింటిలో కూడా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నొప్పిని, మంటను నయం చేస్తాయి. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి. చల్లని వాతావరణంలో వచ్చే వ్యాధులతో పోరాడుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.


తయారీ ఇలా..
ఈ దగ్గు సిరప్ తయారు చేయడానికి ముందుగా కళాయిని స్టవ్ మీద పెట్టండి. ఆ కళాయిలో ఒక కప్పు నీరు, రెండు టేబుల్ స్పూన్ల అల్లం తరుగు, తరిగిన నిమ్మకాయ ముక్కలను వేయండి. మిశ్రమం సగానికి తగ్గేవరకు చిన్న మంట మీద మరిగించండి. తరువాత అర స్పూను మిరియాల పొడిని జోడించండి. అందులోనే నాలుగు తులసి ఆకులు వేసి మరిగించండి. తర్వాత స్టవ్ కట్టేయండి. గోరువెచ్చగా మారాక ఒక స్పూను తేనెను అందులో కలపండి. ఆ మిశ్రమాన్ని ఒక సీసాలో వేసి భద్రపరుచుకోండి. మూడు పూటలా భోజనం చేశాక ఒక టేబుల్ స్పూన్ ఔషధాన్ని తాగండి. ఇలా వారం రోజులపాటు ఈ ఔషధాన్ని సేవిస్తే దగ్గు సహజసిద్ధంగానే తగ్గిపోతుంది. సాధారణంగా వచ్చే దగ్గు అయితే ఈ ఔషధాలకు నయం అవుతుంది. ఈ ఔషధానికి దగ్గు నయం కాకుండా ఉంటే అది తీవ్రమైనదిగా పరిగణించవచ్.చు అప్పుడు వైద్యులను కలిసి అల్లోపతి మందులను వాడండి.


దగ్గు మందుల వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్టులు వస్తున్నట్టు ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. కొన్ని దేశాల్లో కొన్ని రకాల దగ్గు మందులను నిషేధించారు. దానికి కారణం అందులో వాడుతున్న కొన్ని రసాయన సమ్మేళనాలే. ఇలా ఇంట్లోనే సహజసిద్ధంగా దగ్గు ఔషధాన్ని తయారు చేసుకుంటే, ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. చెడు ప్రభావాలు పడవు. ఈ మందు మీకు సరిగా పనిచేయకపోయినా, దీనివల్ల కలిగే నష్టం మాత్రం ఉండదు. కాబట్టి ఒకసారి దగ్గుకు ఈ ఔషధాన్ని తయారు చేసుకొని వాడి చూడండి. మీకు దీని వల్ల దగ్గు తగ్గితే భవిష్యత్తులో అల్లోపతి మందులు వాడాల్సిన అవసరం ఉండదు.


Also read: మహిళలూ, పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్స్ వేసుకుంటే వచ్చే ఆరోగ్య సమస్యలేంటో తెలుసా?




















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.