నోటి దుర్వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నలుగురిలో మాట్లాడాలంటే చిన్నతనంగా అనిపిస్తుంది. పక్క వాళ్ళు కూడా మనల్ని అసహ్యించుకుంటారు. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే నోటి పరిశుభ్రత చాలా అవసరం. నోటిలో బ్యాక్టీరియా, పళ్ళు శుభ్రంగా లేకపోవడం ఒక్కటే కాదు కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా నోటి దుర్వాసనకి కారణం అవుతాయి. వెంటనే స్పందించి శ్రద్ధ తీసుకోకపోతే అది ఇతర సమస్యలకి కారణమవుతుంది.


నోటి దుర్వాసనకి కారణం ఏంటి?


దంతాలు లేదా చిగుళ్ళ వ్యాధులు, వెల్లుల్లి, పచ్చి ఉల్లిపాయలు తినడం, గట్ సమస్యలు, చిన్నపేగు బ్యాక్టీరియా పెరగడం, GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి), కడుపులో యాసిడ్స్ ఎక్కువగా ప్రవహించినప్పుడు నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. అన్నవాహిక, గొంతు, సైనస్ ఇన్ఫెక్షన్లు కూడా మరొక కారణం కావొచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. సల్ఫర్, కీటోన్స్ వంటి అణువుల వల్ల నోటి దుర్వాసన రావొచ్చు. మరి కొంతమందిలో తినే ఆహారం నుంచి లేదా వారు తీసుకునే మందుల నుంచి కూడా అభివృద్ధి చెందుతుంది. రాత్రిపూట నోటిలో ఉండే ఆహార పదార్థాలు బ్యాక్టీరియాగా మారి నోటి దుర్వాసనకి కారణమవుతాయి.


ఎలా పోగొట్టుకోవాలి?


నోటి దుర్వాసనని అరికట్టేందుకు కొన్ని ఆయుర్వేద మార్గాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.


ఓరల్ హెల్త్ కాపాడుకోవాలి: నోటి శుభ్రత చాలా ముఖ్యం. అందుకోసం రోజుకి రెండు సార్లు గోరువెచ్చని త్రిఫల కాషాయాలతో నోరు పుక్కిలించుకోవాలి. అలాగే వేప, బాబూల్ తో చేసిన ఆయుర్వేద టూత్ పౌడర్ ని పళ్ళు తోముకోవడానికి ఉపగయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.


సమతుల్య భోజనం చెయ్యాలి: క్రాష్ డైట్, శరీరం హైడ్రేషన్ గా లేకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. అందుకే భోజనం చివర్లో చేదు, ఆస్ట్రింజెంట్ (ఆయుర్వేద-తిక్త, కాశాయిలోని రెండు రసాలు) తో కూడిన సమతుల్య భోజనాన్ని తినడం మంచిది. శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం నీటిని బాగా తీసుకోవాలి.


కడుపులో ఆమ్లాలు ప్రేరేపించేవి వద్దు: 90 శాతం నోటి దుర్వాసన సమస్య కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ వల్ల వస్తుంది. ఆమ్లాలు ప్రేరేపించే ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ వహించాలి. కొన్ని మందులు కూడా యాసిడ్ రిఫ్లక్స్‌ ని అడ్డుకుంటాయి. వాటి ద్వారా నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు.


సోంపు గింజలు: నోటి దుర్వాసన పోగొట్టుకునేందుకు సోంపు అద్భుతమైన ఔషధం అని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత కాసిన్ని సోంపు గింజలు నోట్లో వేసుకుని నమలడం వల్ల నోరు తాజాగా ఉంటుంది.


ఈ వ్యాధుల వల్లేమో: నోటి దుర్వాసన మధుమేహం, మూత్రపిండ వ్యాధి వంటి అంతర్లీన పరిస్థితులకి సూచిక కావచ్చు. దీంతో పాటు గట్ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపించాలి.


నోరు శుభ్రంగా ఉంచుకునేందుకు రోజుకి రెండు సార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఆయిల్ పుల్లింగ్, మౌత్ ఫ్రెషనర్స్ కూడా వాడవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: BRAT డైట్ అంటే ఏంటి? బరువు తగ్గేందుకు ఇది పాటించవచ్చా?