పొట్ట ఉబ్బరం తట్టుకోవడం కాస్త కష్టమే. తరచుగా పొట్టలో గ్యాస్ ఏర్పడినప్పుడు కడుపు బిర్రుగా తన్నుకొచ్చినట్టు కనిపిస్తుంది. దాని వల్ల పొట్ట సాధారణం కంటే కాస్త పెద్దగా కనిపించి బాధిస్తూ నొప్పిగా అనిపిస్తుంది. శరీరంలో ద్రవం ఎక్కువగా ఉన్నప్పుడు పొట్ట ఉబ్బరంగా కూడా అనిపిస్తుంది. ఆహారం త్వరగా తినడం, పొట్ట నిండినా కూడా ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంది. రాత్రి 9 గంటల తర్వాత తిన్నప్పుడు ఆ ఆహారం జీర్ణం కావడం కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు చాలా మంది గబగబా తినేస్తారు అటువంటి సమయాల్లో శరీరానికి అవసరమైన దాని కంటే ఎక్కువగా తినడం వల్ల పొట్ట ఉబ్బరానికి దారితీస్తుందని ఆయుర్వేద నిపుణుడు దీక్షా భావ్సర్ చెప్పుకొచ్చారు.


పొట్ట ఉబ్బరం తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు


☀ భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలు నమలాలి


☀ పుదీనా నీరు, భోజనం చేసిన ఒక గంట తర్వాత యాలుకల నీరు తాగాలి


☀ జీలకర్ర, కొత్తిమీర, సోంపు గింజలతో చేసిన టీని రోజుకు మూడు సార్లు భోజనానికి ముందు లేదా తర్వాత తాగాలి


☀ భోజనం తర్వాత గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ వామ్ము, రాక్ సాల్ట్, చిటికెడు ఇంగువ వేసుకుని తాగితే మంచిది.


☀ అన్నింటికంటే ముఖ్యంగా భోజనం చేసే సమయంలో లేదా తర్వాత ఎక్కువ నీరు తాగడం మానుకోవాలి.


ఒత్తిడి, హడావుడిగా ఆహారాన్ని తినడం ఎప్పుడు చేయకూడదు. తాజాగా తయారుచేసిన ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు తినడం మంచిది. ఇది జీర్ణం కావడం సులభం. తినేటప్పుడు కూడా వేగంగా కాకుండా నెమ్మదిగా నమిలి మింగాలి. ఉబ్బరం దీర్ఘకాలికంగా ఉంటే పొట్టని ప్రభావితం చేసే ఐబీఎస్, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ ఇబ్బంది, హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకం, మధుమేహం వంటి సమస్యలు కారణం కావచ్చు. ఆహారం, నిద్ర, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి అదుపులో ఉంచుకోవడం వంటి వాటి వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.


కడుపు ఉబ్బరం నుంచి బయటపడటానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అలాగే అల్లం ముక్కని నమిలినా కూడా పొట్టలోని గ్యాస్ బయటకి వెళ్ళేలా చేస్తుంది. ఇది కొన్ని జీర్ణ ఎంజైమ్ లని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఆహారాన్ని వేగంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఉబ్బరం, గుండెల్లో మంటని కూడా తగ్గిస్తుంది. సోంపు గింజలు నమలడం వల్ల గట్ లోని బ్యాక్టీరియా ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది తీసుకుంటే ఉబ్బరం వంటి లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఈ సుగంధ ద్రవ్యాలు మీ వెంట పెట్టుకుంటే అదృష్టం, సంపద మీదే!