ABP Health Conclave 2024 Live Updates: ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్‌లో మెంటల్ హెల్త్‌పై డాక్టర్ మధు వంశీ, డాక్టర్ అరూప కబీర్ కీలక విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియా మెంటల్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని వివరించారు. మనకు వచ్చే సమస్య ఏదైనా దానికి పరిష్కారమే లేదని ముందే ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారని, ఇలా అతిగా ఆలోచించడం వల్లే మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. సమస్యల విషయంలోనూ లింగ వివక్ష చూపిస్తున్నారని డాక్టర్ అరూప అభిప్రాయపడ్డారు. మహిళలు చాలా సెన్సిటివ్‌గా ఉంటారన్న ముద్ర వేశారని, కానీ ఎమోషన్స్‌ అందరికీ ఒకటే అని వివరించారు. ఓ సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతారని, ఇందులో ఆడ, మగ అన్న తేడా చూడడం సరికాదని తెలిపారు. రీల్స్ కారణంగా మహిళల మానసిక ఆరోగ్యంపైనే ఎక్కువగా ప్రభావం పడుతోందన్న వాదనని డాక్టర్ అరూప కొట్టి పారేశారు. మహిళలు ఎన్ని విజయాలు సాధించినా ఇంకా వాళ్లపై ఇలాంటి అభిప్రాయాలు రుద్దుతున్నారని అన్నారు. డిప్రెషన్‌కి, అప్‌సెట్‌కి చాలా తేడా ఉందని వివరించారు. ఓ పిజ్జా షాప్‌కి వెళ్లి ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సి వస్తే ఆ సమయంలో అప్‌సెట్ అవుతాం తప్ప డిప్రెస్ అవ్వమని, ఈ తేడా తెలియక చాలా మంది ప్రతి దానికీ డిప్రెషన్ అనే పేరు పెడుతున్నారని వివరించారు. 


డాక్టర మధు వంశీ ఆత్మహత్యల గురించి ప్రస్తావించారు. ఈ మధ్య కాలంలో సూసైడ్స్ ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. రైతుల్లో ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తే చాలా వరకూ ఆత్మహత్యల్ని అదుపు చేయొచ్చని వివరించారు. మెంటల్ హెల్త్ అనేది మనం తీసుకునే డైట్‌పైనా ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. మనం సాధించింది చిన్న విజయమైనా మనల్ని మనం మెచ్చుకోవాలని, ఈ సెల్ఫ్ రివార్డింగ్ వల్ల మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఓ ఎగ్జామ్ బాగా రాసినప్పుడు వెంటనే బయటకు వెళ్లి నచ్చిన ఫుడ్ తినాలని, నచ్చిన పని చేయాలని సూచించారు. మనకి మనం ఇలా ప్రియార్టీ ఇవ్వాలని తెలిపారు.