Fact Check On Chandrababu Singaport Tour Fake Image: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ మే 13న ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నేతలు విరామం లేకుండా పనిచేశారు. ఎన్నికల వేడి కూడా ముగియడంతో పార్టీలకు అతీతంగా చాలామంది విదేశాల్లో రిలాక్స్ అవుతూ ఉన్నారు. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి అమెరికాకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతూ ఉంది. అయితే, చంద్రబాబు అమెరికాకు కాకుండా సింగపూర్‌కు వెళ్లినట్లు కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. “What are you doing in Singapore when you say you are going to America???” అంటూ ట్విట్టర్ యూజర్లు పోస్టులు పెడుతున్నారు. అమెరికాకు వెళ్తున్నామని చెప్పి చంద్రబాబు సింగపూర్ లో ఏమి చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై 'Newsmeter' స్పష్టత ఇచ్చింది.


నిజ నిర్ధారణ:


ఆర్చర్డ్ రోడ్‌లోని చంద్రబాబుకు సంబంధించిన వైరల్ చిత్రం డిజిటల్‌గా ఎడిట్ చేసినట్లు 'Newsmeter' నిర్ధారించింది. వైరల్ ఇమేజ్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. సెప్టెంబరు 27, 2023న CNA వెబ్‌సైట్ ప్రచురించిన కథనాన్ని చూడొచ్చని తెలిపింది. కథనంలో చూపబడిన చిత్రం వైరల్ ఇమేజ్‌తో సమానంగా ఉంది. ఇక ఆ ఫోటోలో చంద్రబాబు నాయుడు లేరు. ‘File photo of people crossing the road along the Orchard Road shopping belt in Singapore. (Photo: AFP/Roslan Rahman)’ అంటూ ఇమేజ్ క్యాప్షన్‌లో వివరణ ఇచ్చారు. సింగపూర్‌లో ప్రజలు రోడ్డు దాటుతున్నారని ఆ ఫోటో ద్వారా తెలిసింది. ఈ ఫోటో కనీసం సెప్టెంబర్ 2023 నుంచి ఇంటర్నెట్‌లో ఉందని తెలియజేస్తోంది.




ఈ రెండు చిత్రాలను పక్కపక్కనే పోల్చి చూడగా.. రెండూ ఒకేలా ఉన్నాయని చూపిస్తుంది. ఫ్రేమ్ మధ్యలో ముసుగు ధరించిన తెల్లటి దుస్తులు ధరించిన స్త్రీ, ఎడమ వైపున నల్లటి టీ-షర్టులో ఉన్న వ్యక్తి రెండు చిత్రాల్లో ఒకే చోట ఉన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు కూడా విదేశాలకు వెళ్లినట్లు తెలుగు న్యూస్ పోర్టల్ ది ఫెడరల్ మే 19న నివేదించింది. అదే రోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని సైతం కనుగొన్నట్లు 'Newsmeter' తెలిపింది. పార్టీ వర్గాలను ఉటంకిస్తూ, చంద్రబాబు వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లినట్లు కథనం పేర్కొంది. గతంలో అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని.. ఇప్పుడు మరోసారి వెళ్లినట్లు పేర్కొంది. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి వస్తారని ఆ  కథనంలో పేర్కొన్నారు.


అయితే, చంద్రబాబు అమెరికాకు వెళ్లలేదని పార్టీ సభ్యులు పేర్కొన్నట్లు కొన్ని మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి. మే 13న ఏపీ పోలింగ్ రోజు తర్వాత 'NewsMeter' స్వతంత్రంగా చంద్రబాబు ప్రయాణం గురించి ధ్రువీకరించలేకపోయినప్పటికీ.. సింగపూర్ రోడ్డులో చంద్రబాబు ఉన్నారనే వైరల్ ఇమేజ్ ఎడిట్ చేశారని నిర్థారించింది.


This story was originally published by Newsmeter, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.