Kotrike Madhusudan Gupta EVM Breaking Viral Video Fake: ఏపీకి చెందిన ఒక నాయకుడు కొట్రికే మధుసూదన్ గుప్తాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన జనసేన తరపున గుంతకల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని.. ఆయన ఈవీఎంను ధ్వంసం చేసినట్లుగా ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. అది ఇటీవలి ఎన్నికల్లోనే జరిగిందని.. క్లైమ్ చేశారు. ఆయన గుంతకల్లు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని కొంత మంది సోషల్ మీడియాలో రాశారు. 


దాదాపు 46 సెకండ్లు ఉన్న ఆ వైరల్ వీడియోలో తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి కనిపిస్తున్నాడు. రెండు మైక్‌లు కూడా అందులో కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘ఇదంతా రాంగ్. ఇప్పుడు నేను దీన్ని పగలకొడుతున్నాను. ఇదేం ఎలక్షన్? ఇంత అన్యాయం చేస్తారా? ఇదంతా మోసం ఎలా చేస్తారు మీరసలు?’’ అని తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి మధుసూదన్ ఆ వీడియోలో అంటున్నారు. ఆ తర్వాత ఈవీఎంను నేలకేసి బాదారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని పోలీసులు తమ వాహనం వద్దకు తీసుకెళ్లడం ఆ వీడియోలో గమనించవచ్చు.


మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సీసీటీవీ వీడియో వైరల్ అవడంతో కొందరు.. మధుసూదన్ గుప్తా వీడియోను వైరల్ చేశారు. కూటమి అభ్యర్థి మధుసూదన్ గుప్తా కూడా ఈవీఎం పగలగొట్టారని.. ఇతనిపై ఎన్నికల సంఘం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలని ఓ యూజర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.


ఆ పోస్టులకు సంబంధించి ఆర్కైవ్స్ ఇక్కడ ఇంకా ఇక్కడ  కూడా చూడవచ్చు. 



ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు మే 13న జరిగిన సంగతి తెలిసిందే. అయితే, మధుసూదన్ గుప్తా ఈవీఎం పగలగొట్టారని ప్రచారంలో ఉన్న ప్రస్తుత వీడియో ఇప్పటిది కాదు. అది 2019 నాటిది. 


ఏం తెలుసుకున్నాం?
అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఈ 2024 ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేశారనే కథనాలు ఎక్కడా మాకు లభించలేదు. వైరల్ అవుతున్న వీడియోలోని ఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఏఎన్ఐ వార్తా సంస్థ 2019 ఏప్రిల్ 11న ఎక్స్‌లో పెట్టిన వీడియో (పోస్ట్ (ఆర్కైవ్ ఇక్కడ) బయటపడింది. ఈ వీడియోలో 12 సెకన్ల సమయం నుంచి వైరల్ వీడియోలోని ఫుటేజీ ఉంది.


‘‘అనంతపురం జిల్లా గుత్తిలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియో చూడండి. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.’’ అని ఏఎన్ఐ వార్తా సంస్థ 2019 ఏప్రిల్ 11న ఇంగ్లీష్ లో ట్వీట్ చేసింది. 






అదే సమయంలో వచ్చిన ఎన్డీటీవీ కథనాల్లో కూడా ఇవే వివరాలు ఉన్నాయి. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థుల పేర్లు ఈవీఎంలో సరిగ్గా కనిపించనందుకు గాను ఎన్నికల అధికారుల మీద ఆగ్రహించి.. యంత్రాన్ని ధ్వంసం చేశారని ఈ కథనంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో 2019 నాటి ఎన్నికలు 11 ఏప్రిల్ 2019 రోజున జరిగాయి.


అంతేకాక, డెక్కన్ హెరాల్డ్ సంస్థ కూడా ఇదే వీడియోను (ఆర్కైవ్ ఇక్కడ) 2019లోనే యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. అందులో కూడా 48 సెకండ్ల దగ్గర పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తున్న భాగం ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కూడా అదే ఉంది.  దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో 2019లోనిదని స్పష్టంగా అర్థం అవుతోంది.



మధుసూదన్ గుప్తా 2024లో గుంతకల్ నుంచి టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? 


2019లో మధుసూదన్ గుప్తా జనసేన అభ్యర్థి. ఆయన సొంత ఫేస్ బుక్ పేజీలో గుంతకల్ మాజీ ఎమ్మెల్యే అని మాత్రమే ఉంది.


గుంతకల్ టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గుమ్మనూరు జయరాం. ఈయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఈయన కూడా ఈవీఎం ధ్వంసం చేశారని ఎక్కడా వార్తలు రాలేదు.


ఇటీవల పూర్తయిన 2024 ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఒక పోలింగ్ బూత్ లో వీవీప్యాట్ యంత్రాన్ని ధ్వంసం చేస్తూ సీసీటీవీలో దొరికిపోయారు. పోలీసులు ఆయన మీద కేసు పెట్టారు. ఎన్నికల సంఘం ఆయనపై కఠిన చర్యలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. 


తీర్పు
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లో మధుసూధన్ గుప్తా అనే నాయకుడు ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో అంటూ ఒక వీడియో వైరల్ అయ్యింది. అయితే ఇది 2019 ఎన్నికల నాటి వీడియో. అలాగే, మధుసూధన్ గుప్తా గుంతకల్లు టీడీపీ - జన సేన ఉమ్మడి అభ్యర్ధి కాదు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేం నిర్ధారించాము.


This story was originally published by Logically Facts, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.