Fact Check: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలను ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇంట్లో అవసరమైన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని కోరిందని ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ అడ్వైజరీ ప్రకారం, ప్రజలు చేతిలో 50,000 రూపాయల నగదు, రెండు నెలలకు మందులు, అత్యవసర కాంటాక్ట్స్, అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలని కేంద్రం చెప్పినట్టు ఉంది. అయితే PIB నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్‌లో అడ్వైజరీలో పేర్కొన్నవి ఫేక్ అని తేలింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య చాలా ఫేక్ వార్తలు ప్రజలను గందరగోళపరుస్తున్నాయి. అలాంటి వాటిలో ఈ అడ్వాజరీ కూడా ఒకటి. ఇది నిజం అనుకొని చాలా మంది సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇంట్లో అవసరమైన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని కోరిందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో పేర్కొన్నట్టు ప్రజలు చేతిలో 50,000 రూపాయల నగదు, రెండు నెలలకు మందులు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలనే సలహాలు కేంద్రం నుంచి రాలేదు.
సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రజలు ప్రశాంతంగా, అప్రమత్తంగా ఉండాలని కూడా ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై PIB ఫ్యాక్ట్ చెక్ చేసింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అందులో తేలింది. "ప్రభుత్వం అలాంటి సలహా ఏదీ జారీ చేయలేదు" అని PIB తెలిపింది. ఇదే కాకుండా దేశంలోని ఫోన్ కాల్స్ రికార్డు అవుతున్నాయని, వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పోస్టులు కూడా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోయాయనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇది కూడా తప్పుడు ప్రచారమని పీఐబీ వెల్లడించింది. ఇలాంటి నియంత్రణ ఏదీ లేదని తెలిపింది. అయితే తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తే కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబడతారని తెలిపింది. పోస్టులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని కూడా సూచించింది.