ఏపీలో టిక్కెట్ రేట్లకు సంబంధించి ప్రభుత్వం కొత్త జీవోను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల మొదట లాభపడనున్న హీరో ప్రభాస్ ప్రభుత్వ నిర్ణయంపై స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 11వ తేదీన) విడుదల కానున్న సంగతి తెలిసిందే.
గతంలో వైఎస్ జగన్‌ను కలిసిన సినీ ప్రముఖుల్లో కూడా ప్రభాస్ ఉన్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినందుకు హీరో ప్రభాస్ సీఎం జగన్‌కు, టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి చిరంజీవి చేసిన ప్రయత్నాలకూ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక 'రాధేశ్యామ్' సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. 'రాధేశ్యామ్' టీమ్ మొత్తం దేశం మొత్తం చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో తెలుగు మీడియాకు ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఒక్క ఆదివారం రోజునే దాదాపు పది ఛానెల్స్ కి ఓపికగా ఇంటర్వ్యూలు ఇచ్చారు ప్రభాస్. ముంబై, చెన్నై, బెంగుళూరు అంటూ రోజంతా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే ఉన్నారు. చిన్న ఛానెల్స్ కి సైతం ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. గత రెండు, మూడు రోజులుగా గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు ప్రభాస్. నిజానికి ఆయన ఇంత ఓపికగా ఇంటర్వ్యూలు ఇస్తుండడంతో నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలకు ముందే ప్రభాస్ ట్రిప్ కి వెళ్లపోతున్నారని తెలుస్తోంది. ఢిల్లీ, కేరళలో ప్రెస్ మీట్స్ ఉన్నాయి. అవి పూర్తయిన తరువాత హాలిడే కోసం యూరప్ వెళ్లాలనుకుంటున్నారు ప్రభాస్. 'రాధేశ్యామ్' సినిమా రిజల్ట్ వచ్చే సమయానికి ఆయన హాలిడే స్పాట్ లో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. 'సాహో' సినిమా రిలీజ్ సమయంలో కూడా ప్రభాస్ ఇలానే చేశారు. సినిమా విడుదలకు ముందే ఫారెన్ వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వబోతున్నారు.
పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.