సండే ఫన్ డే... అనుకుంటూ వచ్చి ఒక కంటెస్టెంట్‌ను ఇంట్లోంచి ఎలిమినేట్ చేసేస్తారు హోస్ట్ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 6లో మొదటగా ఇంట్లోంచి వెళ్లబోయేది ఎవరు? అనే చర్చలు మొదలైపోయాయి. ఈసారి లేడీ కంటెస్టెంట్లలో ఒకరు బయటికి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. వారిద్దరిలో ఒకరు ఆరోహి రావ్ కాగా, మరొకరు ఇనయా సుల్తానా. అలాగే అభినయశ్రీ పేరు కూడా వినిపిస్తోంది కానీ, ఆమె కన్నా వీరిద్దరికే వెళ్లే ఛాన్సులు అధికంగా ఉన్నట్టు తెలుస్తున్నాయి.
ఇద్దరిలో ఎవరూ?
ఆరోహి లేదా ఇనయాల్లో ఎవరు బయటికి వెళ్తారనే అంశం గురించి మాట్లాడుకుంటే ఎక్కువ మంది ఇనయా వెళ్తుందనే భావిస్తున్నారు. ఇనయా మీర ఆరోహి ఆట ఫర్వాలేదనిపిస్తోంది. ఇనయా అసందర్భంగా మాట్లాడడం, తనకు సంబంధం లేని విషయాల్లో కూడా మధ్యలో దూరి మాట్లాడడం కాస్త మైనస్ కావచ్చు. ఇక ఆరోహి రేవంత్ గొడవపడడం వల్ల ఓట్లు తక్కువ పడి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇంట్లో వాళ్లందరూ రేవంత్‌ను టార్గెట్ చేశారనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో క్రియేట్ అయ్యింది. దీంతో ఆయనకు అందరికన్నా ఎక్కువ ఓటింగ్ పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎలిమినేషన్లో ఉన్న వారిలో ఆయన అధికంగా ఓట్లు పడ్డాయని సమాచారం. అందుకే రేవంత్ తో గొడవ ఆరోహికి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కామన్‌గా ఎవరినైతే అందరూ టార్గెట్ చేసి ఒంటిరిని చేసినట్టు ప్రవర్తిస్తారో, వారికే ఆర్మీలు ఏర్పడడం జరుగుతాయి.
మొదటి వారం రేవంత్ పై అందరూ విరుచుకుపడ్డారు. రెండో వారం కూడా ఇదే సాగితే ఆర్మీలు పనిచేయడం మొదలుపెడతాయి. కౌశల్ ఆర్మీ, అభిజిత్ ఆర్మీలు ఏ రేంజ్‌లో సోషల్ మీడియాలో చురుగ్గా పనిచేశాయో అందరికీ తెలిసిందే. రేవంత్ కోసం కూడా ఒక ఆర్మీ మొదలవ్వచ్చు. ఈ వీక్ రేవంత్ తో ఆరోహి తీవ్రంగానే గొడవపడింది. చిరాకు పడడం, ఆయన్ను జనాభా లెక్కల్లో లేకుంటే సంతోషిస్తా అంటూ కొన్ని అధిక మాటలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది.
అయితే ఇనయాతో పోలిస్తే ఆరోహి ఆటే చాలా మెరుగ్గా ఉంది. అంతేకాదు ఇనయా కన్నా అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ఆరోహినే బెటర్. ఇక అభినయశ్రీ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్ లో ఏమైనా జరగొచ్చు. అభినయశ్రీ అంత చురుగ్గా ఉండడం లేదు. కేవలం నలుగురితో కూర్చుని ఏదో ఒకటి మాట్లాడడంలోనే బిజీగా ఉంటోంది. ఆమె ఇంతవరకు ఓపెన్ అయింది కూడా లేదు. ఈమె కన్నా ఇనయా, ఆరోహిలే నటించుకుండా తమ రియల్ క్యారెక్టర్‌తో ఆడారు.ఈ వీక్ కంటెంట్ ఇచ్చిన వారిలో ఇనయా, ఆరోహిల పేర్లు కూడా ఉంటాయి.కానీ అభినయశ్రీ ఇచ్చిన కంటెంట్ ఏమీ లేదు. కాబట్టి ఇలా ఆలోచిస్తే బిగ్ బాస్ అభినయను ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.