పాన్ ఇండియన్ స్టార్ రాంచరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్నది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ విషయం సినీ ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా తను తెలుగులో సినిమాలు చేయాలనుకుంటోంది. అయితే, కొన్ని అవకాశాలు వచ్చినా పలు కారణాలతో వాటిని చేయలేదు. 


జాన్వీ హీరోయిన్ గా ఓకే అయ్యేనా?


ప్రస్తుతం తన టాలీవుడ్ తొలి సినిమాకు రాంచరణ్ మూవీ అయితే బాగుంటుందని అతిలోక సుందరి ముద్దుల కూతురు భావిస్తోందట. ఈ సినిమా నటించేందుకు ప్రయత్నిస్తోందట. ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. వాస్తవానికి దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ఎన్టీఆర్ తో కలిసి స్పోర్ట్స్ డ్రామాగా తెరెక్కించాలి అనుకున్నాడు. కొన్ని కారణాతో ఈ మూవీలో ఇప్పుడు ఎన్టీఆర్ స్థానంలో రాంచరణ్ నటిస్తున్నాడు. లీడ్ యాక్టర్ తప్ప స్క్రిప్ట్‌ లో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో అనుకున్నట్లుగానే జాన్వీ కపూర్‌ ను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది.


వచ్చే ఏడాది షూటింగ్ మొదలయ్యే అవకాశం!


ఈ సినిమా 2023 ఫస్ట్ హాఫ్ లో మొదలయ్యే అవకాశం ఉంది. జాన్వీ కపూర్ ఈ సినిమాకు సంతకం చేస్తే, దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. జాన్వీ కపూర్ తల్లి, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కలిసి నటించారు.  వీరిద్దరు కలిసి నటించిన పలు సినిమా చక్కటి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు వారి పిల్లలు రామ్ చరణ్,  జాన్వీ కపూర్ కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది.


శంకర్ మూవీలో నటిస్తున్న రాంచరణ్


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'RRR' మూవీ విజయం తర్వాత, రామ్ చరణ్ పాన్-ఇండియన్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఈ చిత్రంలో రాంచరణ్ సీతారామ రాజు పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఆర్‌సీ 15 అనే సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఈ ప్రాజెక్టుతో చాలా బిజీగా ఉన్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి న్యూజీలాండ్ లో షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ చేస్తోంది. శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, అంజలి సహా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్‌ రాజు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


Read Also: ‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ వచ్చేసింది, రిలీజ్ ఎప్పుడంటే?