తెలుగు చలన చిత్రసీమ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ మూవీస్ కొన్ని ఉంటాయి. ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆయన తనయుడు రామ్ చరణ్ (Ram Charan) నటించిన 'ఆచార్య' ఉంటుందని చెప్పవచ్చు. ఆకాశమంత ఎత్తులో ఉన్న  దర్శకుడు ఎవరినైనా ఒక్క డిజాస్టర్ అథఃపాతాళానికి లాగుతుందని చెప్పడానికీ ఈ సినిమా ఒక ఉదాహరణ.


'ఆచార్య' విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా / వరల్డ్ సక్సెస్ సాధించిన 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర చేసిన సినిమా కావడం అందుకు ఓ కారణం అయితే.... తండ్రీ తనయులు చిరు, చరణ్ నటించిన సినిమా మరో కారణం! అపజయాలు ఎరుగని దర్శకులలో ఒకరైన కొరటాల శివ వీళ్ళిద్దరినీ డైరెక్ట్ చేయడం మరో కారణమని చెప్పవచ్చు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆచార్య' అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఎందుకు ఫ్లాప్ అయ్యింది? అనే విశ్లేషణ మొదలైంది. అప్పుడు ఎక్కువ మంది వేలు కొరటాల శివ వైపుకు మళ్ళింది. 


దర్శకుడు కొరటాల శివను మెగా అభిమానులు టార్గెట్ చేశారు. కావాలని ఫ్లాప్ తీశారని సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. మీడియా ముఖంగా మెగాస్టార్ చిరంజీవి సైతం దర్శకుడు చెప్పింది చేశామని వ్యాఖ్యానించడంతో 'ఆచార్య' పరాజయానికి కొరటాల శివను బాధ్యులు చేశారు. ఆ తర్వాత మరొక ఇంటర్వ్యూలో కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఓ హిందీ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లిన రామ్ చరణ్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఒక సినిమాలో ప్రత్యేక పాత్ర చేశానని, ఆ సినిమా సరిగా ఆడలేదని, కంటెంట్ ఉంటే ఏదైనా ఆడుతుందని చెప్పారు. 


'ఆచార్య'తో కొరటాల శివ ఆర్థికంగా నష్టపోయారు. మరోవైపు విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సంగీత దర్శకుడు మణిశర్మ సైతం తప్పంతా కొరటాల శివదే అన్నట్లు మాట్లాడారు. 'ఆచార్య' సంగీతం బాలేదని, ముఖ్యంగా నేపథ్య సంగీతం మెగాస్టార్ స్థాయికి సరిపడిన విధంగా లేదని కొందరు కామెంట్ చేశారు. 'ఆలీతో సరదాగా' షోలో ఆ విమర్శల పట్ల కొరటాల శివ స్పందించారు. 


Also Read : ప్రభాస్‌తో ప్రేమ, పెళ్లిపై కృతి సనన్ రియాక్షన్ ఇదే


'ఆచార్య' మ్యూజిక్ అంతగా సెట్ కాలేదని పబ్లిక్ లో ఒక టాక్ ఉంది. ఎందుకు? అని ఆలీ ప్రశ్నించారు. అప్పుడు మణిశర్మ ''ఎందుకు రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి? అని అడగరు కదా!'' అని ఎదురు ప్రశ్నించారు. ''లాహే లాహే, బంజారా పాటలు పెద్ద హిట్స్. దాని గురించి మాట్లాడరు'' అని ఆయన చెప్పారు. ఆ తర్వాత నేపథ్య సంగీతం గురించి మణిశర్మ మాట్లాడుతూ ''చిరంజీవి గారి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి వచ్చాను. కోటి గారు, కీరవాణి గారు, ఇంకా అందరి దగ్గర ఆయన సినిమాలకు వర్క్ చేశా. నాకు కరెక్ట్ అనిపించిన వెర్షన్ ఒకటి చేశా. డైరెక్టర్ గారు కొత్తగా ట్రై చేద్దామని అన్నారు. ఆయన వెర్షన్ చేశా'' అని వివరించారు. మణిశర్మ మాటలతో మరోసారి కొరటాల శివ కార్నర్ అయ్యారు.