టాలీవుడ్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అరణ్య రోదనేనా? ఆయనకు మద్దతుగా నిలిచేందుకు నిర్మాతలు ఎందుకు వెనకాడుతున్నారు? పవన్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ ఎందుకు తప్పించుకుంటున్నారు? పవన్ ఆవేశం.. టాలీవుడ్‌కు మేలు చేయకపోగా.. కీడు చేస్తుందనే భయం నిర్మాతలను వెంటాడుతోందా? ఈ సందేహాలకు సమాధానాలు దొరక్కపోవచ్చు. కానీ, టాలీవుడ్‌లో పరిస్థితులు చూస్తుంటే.. పవన్‌తో కలిసి పోరాడేందుకు ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే.. ఇది ప్రభుత్వంతో కూర్చొని పరిష్కరించుకోవలసిన విషయమనేది పెద్దల ఆలోచన. ప్రభుత్వంపై పంతం పడితే.. నష్టపోయేది నిర్మాతలే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పైగా.. ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించే విధానాన్ని ఇప్పటికే కొంతమంది చిన్న సినిమాల నిర్మాతలు స్వాగతించారు. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి బలంగా మారింది. ఈ విషయంలో పవన్‌ను ఏకాకిని చేసేందుకు ఏపీ మంత్రులు దీన్ని అస్త్రంగా ప్రయోగిస్తున్నారు.
నష్టం ఎవరికీ? లాభం ఎవరికీ?: ప్రభుత్వమే స్వయంగా సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించడం వల్ల ప్రేక్షకులకే లాభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని వల్ల అదనపు ధరలకు టికెట్లు విక్రయించే సాంప్రదాయానికి తెరపడుతుంది. ఇది బడా నిర్మాతలకు అస్సలు నచ్చడం లేదు. దీనివల్ల బెనిఫిట్ షోల పేరుతో టికెట్లను అధిక ధరలకు విక్రయించడం సాధ్యం కాదనే ఆందోళన పెద్ద నిర్మాతలను ఆలోచనలో పడేసింది. అయితే, దీనిపై ఏపీ సీఎం జగన్‌తో కూర్చొని ఒక నిర్ణయానికి రావాలని భావించారు. కానీ, సీఎం మాత్రం టాలీవుడ్ పెద్దలతో మాట్లాడేందుకు సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ఇటీవల టాలీవుడ్ నిర్మాతలతో సమావేశం జరిగింది. ఇందులో దిల్ రాజుతోపాటు డీఎన్‌వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య, సి.కళ్యాణ్ పాల్గొన్నారు. మంత్రి నాని కూడా వారి సమస్యలు తెలుసుకుని సీఎంకు తెలియజేస్తానని చెప్పారు. సమావేశం తర్వాత నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ టికెట్ విక్రయాల నిర్ణయం పెద్ద సమస్య కాదని వెల్లడించారు. త్వరలోనే సీఎంతో కూడా మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. ఈ సమావేశం తర్వాత చిరంజీవి కూడా ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ.. టాలీవుడ్ కష్టాలపై కరుణ చూపించాలని ప్రభుత్వాలను కోరారు. అంతా పాజిటివ్‌గా సాగిపోతుందని భావిస్తున్న సమయంలో.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ పెద్దలను ఆలోచనలో పడేశాయి. చిరంజీవి కూడా పవన్ వ్యాఖ్యలపై అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఈ విషయంలోకి మోహన్ బాబును కూడా లాగడంతో.. పవన్ ‘మా’ ఎన్నికల కోసమే ఆయన్ని టార్గెట్ చేసుకున్నారా? అనే సందేహాలను కూడా పలువురు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ వేరు.. పవన్ వేరా?: టికెట్లను ఆన్లైన్లో విక్రయించడం వల్ల కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే నష్టమని తెలుస్తోంది. అయితే, ప్రభుత్వంతో వ్యవహారం కావడం వల్ల మాట్లాడి పరిష్కరించుకోవడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ఇందుకు చిరంజీవి నేతృత్వంలో ఇండస్ట్రీ పెద్దల భేటీ కూడా జరిగింది. అయితే, సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఆందోళనతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్.. తనపై ఉన్న కక్షను టాలీవుడ్‌పై చూపుతున్నారంటూ కదంతొక్కడం, ఏపీ మంతులు ఎదురుదాడికి దిగడం టాలీవుడ్‌ను మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇలాంటి సమయంలో సీఎం జగన్‌ను కలిస్తే.. సానుకూలంగా స్పందించే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలను ఇద్దరు, ముగ్గురు హీరోలు స్పందించినా.. దీన్ని రాజకీయ అంశంగానే పరిగణిస్తున్నారు. పవన్ మాటలను ఏకీభవిస్తూనే రాజకీయ అంశాలతో సంబంధం లేదని చెప్పారు. పవన్ ‘జనసేనా’ధిపతి కావడం వల్ల ఈ విషయంపై స్పందించాలా, వద్దా అనే సందిగ్దంతో ఉన్నారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అంతా మౌనం వహిస్తున్నారు. మొత్తానికి పవన్ మాట్లాడిన అంశం.. జనాలకూ ఉపయోగమైందని కాదని, టాలీవుడ్‌లో కేవలం కొంతమంది కోసం ఆయన అంతగా ఆవేశపడినా ఫలితం లేకుండా పోయిందని పలువురు అంటున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్‌కు మోహన్ బాబు కౌంటర్.. నువ్వు నాకంటే చిన్నవాడివి..
నిర్మాతలు Vs నిర్మాతలు: టాలీవుడ్‌ను ఏలుతున్నది బడా నిర్మాతలే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారే ఇప్పుడు సినీ పెద్దలుగా చెలామణి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారికి ప్రత్యేకంగా సినిమా హాళ్లు కూడా ఉన్నాయి. సినిమా నిర్మాణంతోపాటు, ఆ థియేటర్లలో విడుదలయ్యే చిత్రాల ద్వారా కూడా ఆదాయం లభిస్తుంది. ఆన్‌లైన్ టికెట్ల విక్రయం వల్ల నేరుగా ఆ సొమ్ము థియేటర్ యాజమాన్యానికి అందదు. అది నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అక్కడి నుంచి తిరిగి థియేటర్లకు పంపిణీ అవుతుంది. అంటే.. ప్రభుత్వం అకౌంట్లో పడే సొమ్ము తిరిగి వీరి చేతికి అందడానికి సమయం పడుతుంది. అదే సొమ్ము బ్యాంకులో జమా చేస్తే కనీసం వడ్డీ వస్తుందనేది వారి ఆలోచన. అలాగే, కొత్త విధానం వల్ల భారీ సినిమాలకు బెనిఫిట్ షోలు వేసి.. అధిక ధరలతో టికెట్లు విక్రయించే సాంప్రదాయానికి కూడా తెరపడుతుంది. ప్రభుత్వం నిర్ణయించే ధరకు మాత్రమే టికెట్లను విక్రయించాల్సి వస్తుంది. ఇవన్నీ.. బడా నిర్మాతలకు ఇబ్బందికరమే. అయితే, చిన్న నిర్మాతలకు ఈ సమస్యలు ఉండవు. అందుకే, వారు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే, పవన్ వ్యాఖ్యలు టాలీవుడ్ Vs ప్రభుత్వంగా మారిపోవడంతో ఫిల్మ్ చాంబర్ కూడా పవన్‌కు మద్దతు ఇవ్వలేదు. పవన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటితో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలు కూడా ఇదే ఆలోచనతో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కేవలం నాని, కార్తికేయ మాత్రమే పవన్‌కు మద్దతు తెలిపారు. నాని కూడా పవన్.. ‘టక్ జగదీష్’ వివాదాన్ని ప్రస్తావించడం వల్లే స్పందించాడని అంటున్నారు. మరి, పవన్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందా? లేదా జాలి చూపుతుందా అనేది చూడాలి.
Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్