కృష్ణం రాజు.. ఆయన కోసం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఒక ఆల్‌రౌండర్. తెలుగు సినీ పరిశ్రమ ఆత్మీయ మిత్రుడు. అందుకే, ఆయన మరణాన్ని పరిశ్రమ తట్టుకోలేకపోతోంది. నవ్వుతూ.. నవ్విస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ.. కడుపు నిండా భోజనం పెట్టి పంపితేగానీ.. సంతృప్తి చెందని మర్యాద రామన్న ఆయన. ఇండస్ట్రీకి ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌ను పరిచయం చేసిన పెద్ద(నా)న్న. నిత్యం చురుగ్గా కనిపించే ఆయన ఇక లేరు అంటే ఆయన సన్నిహితులకు కష్టమే. 


కృష్ణం రాజు అనుభవాలను, ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చెప్పాలంటే ఈ జీవితం సరిపోదు. వాటిలో కొన్ని మాత్రమే మనం తెలుసుకోగలం. అయితే, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణం రాజు.. ఓ సారి ఇండస్ట్రీని వదిలేద్దామని అనుకున్నారట. ఆ ఆలోచన రావడానికి బలమైన కారణమే ఉందట. అదేంటంటే..


సినీ పరిశ్రమకు పరిచయం కావడానికే కాదు, ఒకసారి అడుగు పెట్టిన తర్వాత నిలదొక్కుకోవాలంటే శ్రమించాల్సిందే. ఒక వేళ నటనకు మంచి మార్కులు పడినా.. అవకాశాలు మాత్రం హ్యాండిస్తుంటాయి. కృష్ణం రాజు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అదే జరిగింది. ఆయన నటించిన మొదటి చిత్రం ‘చిలక గోరింక’ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో కృష్ణం రాజు ఆందోళన చెందారు. తెలుగు ప్రేక్షకులకు నేను నచ్చలేదా? నా నటన నచ్చలేదా? అని మదనపడ్డారట. ఇక ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోదమనే నిర్ణయానికి వచ్చేశారట.


 అయితే, అనుకోకుండా ఆయన ఓ రోజు ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎల్వీ ప్రసాద్‌ను కలిశారు. కాస్త నిరుత్సాహంగానే.. తన సమస్యను చెప్పారట. ఇండస్ట్రీ వదిలేద్దామనే నిర్ణయాన్ని ఆయనకు తెలిపారట. మీరు చేసేది ఏ పాత్రైనా ప్రజలకు దగ్గరవ్వడం ముఖ్యం. అప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉండాలని చెప్పడంతో.. కృష్ణం రాజు మళ్లీ అలాంటి ఆలోచన చేయలేదట. ఈ విషయాన్ని కృష్ణం రాజే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 


Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!


కృష్ణంరాజు ఆదివారం ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం బాలేదని సమాచారం. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. తెల్లవారుజామున సుమారు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఆయన తుదిశ్వాస  విడిచారు. కృష్ణం రాజు స్వస్థలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. జనవరి 20, 1940న ఆయన జన్మించారు. చదువు పూర్తి చేశాక... నటన మీద ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. 'చిలకా గోరింకా' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. హీరోగా, ఆ తర్వాత విలన్ గా కూడా నటించారు. సినిమాల్లో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లో కూడా సేవలు అందించారు. కృష్ణం రాజు మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్