న అద్భుత నృత్యాలతో తెలుగు సినిమా పరిశ్రమను ఉర్రూతలూగించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌ ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 18, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆయన అసలు పేరు ఎస్. రామారావు.  విశాఖపట్నంలో షూటింగ్‌లో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.  గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ అసాధారణ ప్రతిభావంతుడైన రాకేష్ మాస్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు ఆయనకు నివాళి అర్పించారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటుగా అభివర్ణించారు.  


హైదరాబాద్ లో పుట్టి పెరిగిన రాకేష్ మాస్టర్


రాకేష్ మాస్టర్ హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగారు. చిన్నప్పటి నుంచి రాకేష్ మాస్టర్ కు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని అనే కోరిక ఉండేది. నృత్యకళపై మక్కువ బాగా ఎక్కువ. తనంతట తానే డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత అద్భుత డ్యాన్స్ మాస్టర్ గా రూపొందారు. అతడి అభిమానులు ఆయనకు ఏకలవ్య అనే ముద్దుపేరు పెట్టారు. డ్యాన్స్ పట్ల తనకున్న అభిరుచితో పాటు, రాకేష్ మాస్టర్‌కు జిమ్నాస్టిక్స్‌ అంటే కూడా చాలా ఇష్టం. పలు కళల్లో ఆయన రాణించారు. హైదరాబాద్ లో చదువు పూర్తి చేసిన తర్వాత రాకేష్ మాస్టర్ తిరుపతికి మాకాం మార్చారు. అక్కడ ఒక చిన్న డ్యాన్స్ స్టూడియోను స్థాపించాడు.  తన నైపుణ్యాన్ని మరింతగా పెంచుకున్నాడు. ఔత్సాహిక విద్యార్థులకు నృత్యం నేర్పించాడు.  ఒక్కో విద్యార్థికి డ్యాన్స్ నేర్పించేందుకు ఆయన కేవలం రూ. 5 తీసుకునేవారు. కళారూపం పట్ల, దాని వ్యాప్తి పట్ల ఆయనకున్న సంకల్పానికి ఈ ధర నిదర్శనం. 


2011లో కొరియోగ్రాఫర్ గా వెండి తెరకు పరిచయం


తన కెరీర్ ప్రారంభంలో  రాకేష్ మాస్టర్ తన స్నేహితులు వేణు పాల్, ప్రేమ్ గోపి, గిరీష్,  నటుడు తనికెళ్ల భరణి నుంచి చక్కటి సపోర్టు తీసుకున్నారు. వారి మార్గదర్శకత్వంలో ముందుకు నడిచారు. వారి మూలంగా ఆయనకు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు వచ్చేందుకు ఉపయోగపడ్డాయి.  2011లో రాకేష్ మాస్టర్ "అవ్వ’ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ప్రభాష్, మహేష్ బాబు, రామ్ పోతినేనితో పాటు పలువురు స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. శేఖర్ మాస్టర్ సహా పలువురు కొరియోగ్రాఫర్లకు ఆయన గురువు. ఆయన దగ్గరే వారు డ్యాన్స్‌లో ఓనమాలు నేర్చుకున్నారు. రాకేష్ మాస్టర్ ఢీ లాంటి డ్యాన్స్ రియాలిటీ షోలలోనూ తన ప్రతిభను ప్రదర్శించారు. పాపులర్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   






పలు ఇంటర్వ్యూలలో రాకేష్ మాస్టర్ సినిమా పరిశ్రమ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఇతర కొరియోగ్రాఫర్లతో పోల్చితే తనకు పెద్దగా రెమ్యునరేషన్ ఉండేది కాదని, ఇస్తామని చెప్పిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వని సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. అవకాశాల కోసం తాను ఎవరినీ బతిమలాడనని చెప్పారు. తన డ్యాన్స్ మీద నమ్మకం ఉన్నవారు తప్పకుండా తనకు అవకాశాలు ఇస్తారని చెప్పుకొచ్చారు. చివరి వరకు తను ఒకరి దగ్గరికి వెళ్లి అవకాశాల కోసం వెంపర్లాడలేదు. ఇండస్ట్రీని ఏలే శిష్యులు ఉన్నా, ఒక్కరినీ చేయి చాటి యాచించలేదు. బతికినంత కాలం నిజాయితీగానే ఉన్నారు. కాలక్రమేనా.. ఆయనకు అవకాశాలు తగ్గడంతో మానసికంగా కుంగిపోయారు. శిష్యులు కూడా అవకాశాలను అందిపుచ్చుకొనే క్రమంలో రాకేష్‌ను పట్టించుకోలేదు. అలాంటి సందర్భంలో ఆయనకు యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా ఉపాధి లభించింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన మళ్లీ చర్చలోకి వచ్చారు. అయితే, ఆయన పూర్తి భిన్నంగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అందులో పాపులారిటీ పొందిన వ్యక్తులతో జతకడుతూ.. వాళ్లతోనే కాలక్షేపం చేస్తూ.. సరదాగా గడిపారు. చివరకు ఊహించని విధంగా జీవితానికి వీడ్కోలు పలికారు.


Read Also: రిహార్సల్స్ చేసి మరీ లిప్ లాక్ - వైరల్ గా మారిన స్మృతి వెంకట్ ముద్దు సీన్!