మోడల్ నుంచి నటిగా మారిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి. సింగర్ గా, డ్యాన్సర్ గా, మోడల్ గా రాణించిన ఆమె  2014లో హిందీ సినిమా ‘రోర్ : టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్’తో వెండి తెరపై అడుగు పెట్టింది. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. ‘టెంపర్‌’, ‘కిక్‌2’, ‘లోఫర్‌’, ‘ఊపిరి’ చిత్రాల్లో అదిరిపోయే స్టెప్స్ తో మెప్పించింది. ‘బాహుబలి’ సినిమాలో ‘‘మనోహరి..’’ పాటలో తన ఒంపు సొంపులతో ఆకట్టుకుంది. ఒకప్పుడు సినిమా సెట్ లో తోటి నటుడిని చెప్పుతో కొట్టి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె, ఆ రోజు ఏం జరిగిందో వివరించింది.   


తొలి సినిమా షూటింగ్ సెట్లోనే నోరా పోట్లాట


సినిమాల్లోనే కాదు కొన్నిసార్లు సినిమా సెట్స్‌ లో కూడా గొడవలు జరుగుతుంటాయి. అవి మితిమీరిపోతేనే ఎక్కడాలేని తలనొప్పులు వస్తాయి. హీరోయిన్‌, డ్యాన్సింగ్‌ క్వీన్‌ నోరా ఫతేహి తన తొలి సినిమా షూటింగ్‌లోనే కొట్లాటకు దిగింది. ‘రోర్‌: టైగర్స్‌ ఆఫ్‌ ది సుందర్బన్స్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన చేదు ఘటన గురించి తాజా కపిల్ శర్మ కామెడీ షోలో వెల్లడించింది. “బంగ్లాదేశ్‌లోని సుందర్బన్స్‌ అడవుల్లో రోర్‌ షూటింగ్‌ జరుగుతోంది. సంస్కారం లేని ఓ నటుడు నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నాకు కోపమొచ్చి వెంటనే అతడి చెంప పగలగొట్టాను. దీంతో అతడు కూడా తిరిగి నన్ను కొట్టాడు. నేను మళ్లీ తిరిగి కొట్టాను. అతడు నా జుట్టు పట్టుకుని లాగాడు. నేను కూడా అతడి జుట్టు పట్టుకుని లాగాను. అందరూ చూస్తుండగానే మేమిద్దరం గట్టి గట్టిగా కొట్టేసుకున్నాం. వెంటనే డైరెక్టర్‌ జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపాడు” అని చెప్పుకొచ్చింది.


నోరాపై నెటిజన్ల ఆగ్రహం


ఆమె చెప్పింది విని ఆ షోలో ఉన్న అర్చన పూరన్‌ సింగ్‌, కపిల్‌ శర్మ, ఆయుష్మాన్‌ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. కానీ నోరా మాత్రం ఆ సంఘటన గురించి చెప్తున్నంత సేపు పడీపడీ నవ్వుతూనే ఉంది. నువ్వేమైనా జోక్‌ చెప్తున్నావా? ఎందుకంత నవ్వుతున్నావు? ఇదేదో కామెడీ అనుకుంటుందా? ఏంటీ? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అటు ఈ షోలో పాల్గొన్న అర్చన మాటలను సైతం నోరా విభేదించింది. డేట్స్‌ కు వెళ్లినప్పుడు తాను బిల్లు కట్టనని నోరా చెప్పింది. ఇప్పుడు లోకం మారిందని, అమ్మాయిలు కూడా బిల్లు కడుతున్నారని అర్చన చెప్పగా.. అయితే నువ్వు కట్టుకో, కానీ నేను మాత్రం కట్టనంటూ దురుసుగా మాట్లాడింది.  ఆమె మాట తీరుపైనా నెటిజన్లు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


ఇకపోతే నోరా.. ‘టెంపర్‌’, ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘కిక్‌ 2’, ‘ఊపిరి’, ‘లోఫర్‌’ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో ఓ ఊపు ఊపింది. దిల్‌ బర్‌ పాట గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆమె జాన్‌ అబ్రహం, షెహనాజ్‌ గిల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘100%’ చిత్రంలో నటిస్తోంది.






Read Also; ‘బాహుబలి2’ రికార్డును ‘పఠాన్’ బద్దలుకొట్టేనా? తాజా పరిణామాలు ఏం చెప్తున్నాయంటే?