Vizianagaram Crime news : కరోనా భయంతో నెలల తరబడి తమను తాము బంధించుకున్న వారి గురించి విన్నాం. కానీ భార్యపై అనుమానంతో ఆమెను పదొకొండేళ్ల పాటు ఒకే చీకటి గదికి పరిమితం చేసిన వ్యక్తి గురించి తెలుసా ?. ఎక్కడో లేడు.. మన మధ్యనే ఉన్నాడు. విజయనగరంలో లాయర్‌గా పని చేస్తున్న గోదావరి మధుసూదన్ తన భార్యను పదకొండేళ్ల నుంచి బయట ప్రపంచానికి చూపించలేదు. బయటకు అంటే ఇంట్లోనే చీకటి గదిలో ఉంచేసేవాడు. ఇక మిగతా ఇంట్లోకి కూడా రానిచ్చేవాడు కాదు. అలా పదకొండేళ్ల పాటు ఆమె ఆ చీకటి గదిలో బందీగా ఉంది. చివరికి ఆమె తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి... కూతుర్ని కాపాడుకున్నారు.
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియ కు విజయనగరం పట్టణం కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్ తో 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. న్యాయవాది మధుసూదన్ తన తల్లి గోదావరి ఉమామహేశ్వరి తో పాటు తన తమ్ముడు మాటలు విని కట్టుకున్న భార్యను బయట ప్రపంచానికి దూరం చేస్తూ చీకటి గదిలో బంధించాడు. ఎప్పుడూ బయటకు తీసుకు వచ్చేవాడు కాదు. పిల్లల్ని కూడా వెళ్లనివ్వడు. తన తల్లితోనే పిల్లల ఆలనా పాలనా చూపించేవాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు పదకొండేళ్లు గడిచిపోయాయి.
చాలా సార్లు మధుసూదన్ బంధువు.. సాయి సుప్రియ తల్లిదండ్రులు.. ఆరా తీసినా ఏదో ఒకటి చెప్పేవాడు. ఎవరైనా గట్టిగా అడిగితే .. తాను లాయర్ నని చెప్పి బెదిరించేవాడు. తమ కుమార్తె బతికి ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో సాయి సుప్రియ తల్లిదండ్రులు చివరికి న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో తమ కుమార్తె ఏమైందో తెలియక వారు 11 సంవత్సరాల పాటు నరకయాతన అనుభవించారు. సహనం కోల్పోయిన బాధితురాకి తల్లిదండ్రులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఒకటవ పట్టణ పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన గోదావరి మధుసూదన్ ఇంటికి వెళ్లారు." మా ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదు, తనిఖీ చేసేందుకు కోర్టు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా" అని పోలీసులను ఆయన ఎదురు ప్రశ్నించాడు. దీంతో పోలీసులు, బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకువచ్చారు.
సెర్చ్ వారెంట్తో బుధవారం పోలీసులు.. న్యాయవాది మధుసూదన్ ఇంటిని తనిఖీ చేశారు. సాయి ప్రియ బక్క చిక్కిన శరీరంతో చీకటి గదిలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఓ మూలన కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకువచ్చి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని ఒకటవ పట్టణ సీఐ వెంకటరావు తెలిపారు.
పైకి సాధారణంగా కనిపించే లాయర్ మధుసూదనరావు.. ఇంత మూర్ఖుడా అని చుట్టుపక్కల వారు చర్చించుకుంటున్నారు. భార్యతో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి కానీ ఇలా జైలు శిక్ష వేసినట్లుగా ఇంట్లో బంధించి... సరిగ్గా తిండి పెట్టకుండా చిక్కిశల్యం అయ్యేలా చేయడం అంటే.. వారు అసలు మనుషులు కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.