నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘పఠాన్’ మూవీతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఈ మూవీతో బాక్సాపీస్ దగ్గర రికార్డుల మోత మోగించాడు. ప్రస్తుతం ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ హిందీ కలెక్షన్ ను బీట్ చేసేందుకు రెడీ అయ్యింది. కానీ, ఆ రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ కాదనిపిస్తోంది. సౌత్ ఇండియన్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం ముందు ‘పఠాన్’ తలవంచక తప్పదని తెలుస్తోంది.   


‘బాహుబలి 2’ రికార్డు బద్దలు కొట్టేనా?


సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘పఠాన్’ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం, అశుతోష్ రానా, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటించారు. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ పాత్రలో కనిపించి మెప్పించాడు. 4 సంవత్సరాల తర్వాత షారుఖ్ తిరిగి వెండి తెరపై కనిపించడంతో ప్రేక్షకులలో ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. అంచనాలకు మించి ఈ సినిమా రన్ అవుతోంది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్ విషయానికి వస్తే, ‘బాహుబలి2’ (హిందీ) వరుసగా 35 రోజుల పాటు 1 కోటి, అంతకంటే ఎక్కువ కలెక్షన్ వసూలు చేసింది.


ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ తో అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ (హిందీ) నిజంగా దగ్గరగా వచ్చింది. కానీ, ఆ రికార్డును దాటే అవకాశం కనిపించడం లేదు. పఠాన్ (హిందీ) 33 రోజుల పాటు వరుసగా రోజుకు రూ.1 కోటి చొప్పున కలెక్షన్ సాధించింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, పఠాన్ రూ.1 కోటి మార్క్‌ దగ్గర ఊగిసలాడుతోంది. 34వ రోజు అధికారిక కలెక్షన్ వచ్చినప్పుడు ఈ చిత్రం మార్క్‌ ను కొట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే, 35వ రోజున షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం రూ.1 కోటి కలెక్షన్లను దాటడం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. సో, ‘బాహుబలి2’ 35 రోజుల కలెక్షన్ రికార్డును ‘పఠాన్’ బ్రేక్ చేసే అవకాశం కనిపించడం లేదు.  






‘పఠాన్’ ముందు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న షారుఖ్


'పఠాన్' సినిమా విడుదలకు ముందు షారుఖ్ ఖాన్ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. 'పఠాన్' టైటిల్ నుంచి షారుఖ్ లుక్, సినిమాలోని 'బేషరమ్ రంగ్' పాటలో దీపికా పదుకోన్ ధరించిన బికినీ రంగు, సోషల్ మీడియాలో బాయ్ కాట్ పఠాన్ ట్రెండ్స్... ఒక్కటి కాదు, బోలెడన్ని సమస్యలు ఫేస్ చేశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ విడుదలైన 'పఠాన్' తొలి రోజు నుంచి షారూఖ్ ఖాన్ రేంజ్ ఏంటో ప్రపంచానికి చెబుతోంది. సౌత్ సినిమాల దాటికి కుదేలైన బాలీవుడ్‌ను ఊపిరి పీల్చుకోమని భరోసా ఇస్తోంది. 






Read Also: ‘పఠాన్’ మూవీ గురించి మీకు తెలియని 8 ఇంట్రెస్టింగ్ విషయాలు