తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకప్పుడు సౌత్ సినిమాలంటే.. ముఖ్యంగా తెలుగు సినిమాలంటే చిన్న చూపు చూసిన వారంతా.. ఇప్పుడు తెలుగులో సినిమాలు చేసేందుకు ఎదురు చూస్తున్నారు. గతంలో బాలీవుడ్ లో చిన్న చితకా పాత్రలు చేసి గొప్పగా ఫీలైన తెలుగు నటీనటులు ఉండగా.. ఇప్పుడు బాలీవుడ్ నటీనటులతో పాటు దర్శక నిర్మాతలు తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు సైతం తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు.
తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సీతారామం’. అందమైన దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు విడుదలైన అన్ని భాషల్లోనూ అద్భుత విజయాలను అందుకుంది. రామ్ గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ నటనకు ప్రేక్షకులు మైమరచిపోయారు.
ఆగస్ట్ 5న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అదుర్స్ అనిపించింది. ఈ అద్భుత ఈ ప్రేమ కావ్యం అమెరికా సహా ఇతర దేశాల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. అక్కడి తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ లోనూ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
‘సీతారామం’ సినిమా ఓ అద్భుత దృశ్యకావ్యంగా ఆయన అభివర్ణించారు. హీరో, హీరోయిన్లు దుల్కర్, మృణాల్ పైనా పొగడ్తల జల్లు కురిపించారు. “నిన్న రాత్రి హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతారామం' మూవీని చూశాను. దుల్కర్ సల్మాన్ నటన నన్ను బాగా ఆకట్టుకుంది. అతడి నటన చాలా నేచురల్ గా ఉంది. చాలా రీఫ్రెష్ గా అనిపించింది. యువ నటి మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలిసారి ఆమె నటన చూశాను. చాలా సహాజంగా ఉంది. ఆమె పెద్ద స్టార్ అవుతుంది. ‘సీతారామం’ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’ అంటూ వివేక్ అగ్ని హోత్రి ప్రశంసించారు.
ఒక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ సినిమాను ఇంతగా అభినందించడం పట్ల ‘సీతారామం’ సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది అనడానికి ఇదే ఉదాహరణ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం వివేక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అటు బాలీవుడ్ లో తాజాగా సంచలనం సృష్టించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు.
Also Read : ఈ వారం థియేట్రికల్ - ఓటీటీ రిలీజెస్ ఇవే!
Also Read : ‘జైలర్’ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం! నిజంగానే రజనీ మూవీ నుంచి తప్పుకుందా?