వైరల్‌గా కమల్, సూర్య ట్వీట్‌లు 


ఇప్పుడు దేశమంతా మేజర్, విక్రమ్ సినిమాల గురించే మాట్లాడుకుంటోంది. జూన్‌3 వ తేదీన విడుదలైన ఈ రెండు చిత్రాలూ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మేజర్ ఉత్తమ చిత్రం అని అంతా ప్రశంసిస్తున్నారు. విక్రమ్ విషయానికొస్తే కమల్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. కమల్ హాసన్ మెయిల్ లీడ్‌ రోల్‌లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌ ముఖ్య పాత్రల్లో కనిపించిన విక్రమ్ మూవీ మంచి టాక్‌తో వసూళ్లు రాబడుతోంది. అతిథి పాత్రలో సూర్య కనిపించటమూ అభిమానులను అలరిస్తోంది. లోకేశ్ కనకరాజ్‌ దర్శకత్వ ప్రతిభను అంతా మెచ్చుకుంటున్నారు. భారీ స్టార్‌లను డీల్ చేయటంలో సక్సెస్ అయ్యాడని విమర్శకులూ ప్రశంసలు అందిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ యూనివర్స్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. 


సూర్య తమ్ముడు గారు: కమల్ హాసన్ ట్వీట్


ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో హీరో సూర్య ఓ ట్వీట్ చేశారు. దానికి కమల్ హాసన్ బదులిస్తూ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్ అయింది. "కమల్ అన్నా మీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతగానే ఎదురు చూశాను. ఇప్పటికి ఆ కల నెరవేరింది. ఈ కల నిజం చేసిన డైరెక్టర్‌ లోకేశ్ కనకరాజ్‌కు ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు చూసి నేను ఉప్పొంగిపోతున్నాను" అని సూర్య ట్వీట్ చేశారు. దీనిపై కమల్ హాసన్ ట్విటర్ వేదికగానే స్పందించారు. "డియర్ సూర్య తంబి, మనం కలిసి సినిమా చేయాలని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నామో నీకు తెలుసు. ఎప్పటి నుంచో నీపై ప్రజలు ప్రేమాభిమాలు కురిపిస్తున్నారు. ఇప్పుడు వారి సంఖ్య మరింత పెరిగింది. భవిష్యత్‌ ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను. ఆల్‌ ది వెరీ బెస్ట్ తంబీ..సారీ తంబీగారు" అని ట్వీట్ చేశారు కమల్ హాసన్. సూర్యని తమ్ముడుగారూ అని కమల్ సంబోధించటమే హాట్ టాపిక్ అయింది. అంత పెద్ద స్టార్ సూర్యని గారు అని పిలవటం అంటే గొప్ప విషయమేనని అంటున్నారు నెటిజన్లు.










రోలెక్స్ పాత్రలో సూర్య నటన అదుర్స్


విక్రమ్ చిత్రంలో డ్రగ్స్ మాఫియా కింగ్‌గా రోలెక్స్ పాత్రలో నటించారు సూర్య. కనిపించింది కాసేపే అయినా యాక్టింగ్‌లో అదరగొట్టాడు. సూర్య నటన అద్భుతమని అంతా ప్రశంసిస్తున్నారు. రోలెక్స్ క్యారెక్టర్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు సూర్య ఏ రేంజ్‌లో నటించారో చెప్పటానికి. ట్విటర్‌లో హ్యాష్‌ట్యాగ్ రోలెక్స్‌తో సూర్య అభిమానులు తమ హీరోని పొగుడుతూ పోస్ట్‌లు కూడా పెడుతున్నారు.