Srikakulam Mother Son Death: శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో రెండేళ్ల కుమారుడిని తాడుతో ఉరి తీసి, ఆ తర్వాత తాను ఉరి పోసుకుని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. శనివారం రాత్రి రాజాం గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు వివరాలు అందించారు.
ఆ మేరకు శనివారం రాత్రి రాజాం గ్రామానికి చెందిన రెయ్యి జ్యోతి అనే 27 ఏళ్ల వివాహిత తన కుమారుడు రెయ్యి ప్రవీణ్ అలియాస్ హృదయాన్ ఇద్దరూ తమ ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒడిషా రాష్ట్రం తాడిపేటకు చెందిన జ్యోతికి రాజాం గ్రామానికి చెందిన రెయ్యి ధనరాజుతో 2018 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ప్రవీణ్ అలియాస్ హృదయన్ ఉన్నారు.
హైదరాబాద్‌లో భార్య జ్యోతి, కుమారుడు ప్రవీణ్ తో ఉంటున్న ధనరాజు ఇటీవలే రాజాం గ్రామానికి వచ్చాడు. కుమారుడి పుట్టిన రోజు వేడుకలు చేసి నాలుగు రోజుల క్రితం భార్య కుమారుడిని తన తల్లి తిరుపతమ్మ వద్ద ఉంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అయితే, శనివారం మధ్యాహ్నం ఉపాధి పనికి ధనరాజు తల్లి తిరుపతమ్మ వెళ్లి తిరిగి ఇంటి వద్దకు చేరుకున్నాక కోడలు జ్యోతి, మనవడు ప్రవీణ్ తాడుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. దీంతో అవాక్కయిన తిరుపతమ్మ ఆందోళన చెంది కేకలు వేసింది. వెంటనే గ్రామస్థులు వచ్చి పరిశీలన చేసేటప్పటికే వీరు మృతి చెంది ఉన్నారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గోవిందరావు సీఐ రాము చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వలనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కుమారుడిని తాడుతో వేలాడదీసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ కేసుపై మరిన్ని వివరాల కోసం వజ్రపుకొత్తూరు పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Rape On Cow : చివరికి ఆవును కూడా వదల్లేదు - రేప్ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కేశాడు !