బాలీవుడ్ ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే(77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతోన్న ఆయన పుణే ఆసుపత్రి లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి లో వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్న ఆయన అవయవాలు పనిచేయకపోవడంతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు పుణే వైకుంఠ శ్మశాన వాటికలో నిర్వహించారు. గోఖలే మృతి తో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విక్రమ్ గోఖలే 1947లో జన్మించారు. ఆయనకు భార్య వృశాలి గోఖ్లే, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తండ్రి చంద్రకాంత్ గోఖలే కూడా రంగస్థల నటుడే కావడం విశేషం. గోఖలే తండ్రి కూడా పలు సినిమాల్లో కనిపించారు. విక్రమ్ గోఖలే నాయనమ్మ దుర్గాబాయి కామత్ సినీ రంగంలో తొలి మహిళా నటిగా పేరు పొందింది. విక్రమ్ గోఖలే నాటక రంగంలో అనేక నాటకాల్లో నటించారు. ఆయన చేసిన నాటక పాత్రలు ఎన్నో ఆయనకు గుర్తింపు తెచ్చాయి. తర్వాత సినిమా రంగం వైపు అడుగుపెట్టారు విక్రమ్. తర్వాత ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు.
విక్రమ్ గోఖలే 1971లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పర్వానా’ సినిమాతో కెరీర్‌ని మొదలుపెట్టారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ 'అగ్నిపథ్' సినిమాలో ఆయన నటన మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా ఆయన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా గా నిలిచింది. ఈ సినిమా లో గోఖలే పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే కమల్ హాసన్ 'హే రామ్', సంజయ్ లీల భన్సాలీ సినిమా 'హమ్ దిల్ దే చుకే' లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ‘భూల్ భులయ్యా’, ‘మిషన్ మంగళ్’, ‘దే దానా దాన్’, ‘హిచ్కీ’, ‘నికమ్మ’, ‘అగ్నీపథ్’, హమ్ దిల్ దే చుకే సనమ్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో నటించి మెప్పించారు.
కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ ఆయన మంచి సినిమాలు తెరకెక్కించారు. 2010 లో స్ప్రింట్ ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్ పై నిర్మించిన మరాఠీ సినిమా 'ఆఘాత్'తో దర్శకుడిగా పరిచయం అయ్యాయరు. అటు బుల్లితెర లోనూ ఆయన తన సత్తా చాటారు. 'ఘర్ ఆజా పరదేశి', 'అల్ప్విరామ్', 'జానా నా దిల్ సే దూర్', 'సంజీవ్ని', 'ఇంద్రధనుష్' వంటి షోలతో 2010లో విక్రమ్ గోఖలే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. భారతీయ సినిమా పితామహుడిగా పేరు తెచ్చుకున్న దాదాసాహెబ్ ఫాల్కేకు వరసకు విక్రమ్ మనవడు కావడం విశేషం.
Read Also: నలభై తొమ్మిదేళ్ల తరువాత బ్రూస్ లీ మరణ మిస్టరీని చేధించిన పరిశోధకులు
గోఖలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన మృతి చెందారంటూ ఇంతకుముందు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం కూడా తెలిపారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే ఇంతలోనే ఆయన చనిపోయారనే వార్త తెలియడంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదం లోకి వెళ్లారు. నటుడు విక్రమ్ గోఖలే మృతి పట్ల పలువురు ప్రమఖులు నివాళులర్పించారు.