Tiruchanuru Padmavathi Temple: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబరు 28వ తేదీ జరుగనున్న పంచమి తీర్థానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ప్రశాంతంగా అమ్మవారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. వేలాది మంది భక్తులు సేద తీరేలా ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్లు నిర్మించి ఆదివారం రాత్రి నుంచే ఇక్కడ అన్నప్రసాదాలు, తాగునీరు, టీ అందించేందుకు సిద్ధం అయ్యింది.. పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బారీకేడ్లు, పద్మ పుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, సూచిక బోర్డులు తదితర పనులు పూర్తయ్యాయి. వేలాది మంది భక్తులు వేచి ఉండేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, పూడి మార్గం, హైస్కూలు ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు, రేకుల షెడ్లు ఏర్పాటు చేసింది.
పోలీసుల సహకారంతో భద్రత
భక్తుల సౌకర్యార్థం జిల్లా పోలీసు శాఖతో కలసి టీటీడీ నిఘా, భద్రత విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ భద్రతా సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్ సీసీ విద్యార్థులతో పాటు 2,500 పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తోళ్ళప్ప గార్డన్స్‌లో 50, హైస్కూల్ వద్ద 20, నవజీవన్ ఆసుపత్రి వద్ద 25, పూడి రోడ్డు వద్ద షెడ్ లో 25 ఇలా మొత్తం 120 అన్నప్రసాదం పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా పార్కింగ్ ప్రాంతాల్లో కూడా అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
సకల ఏర్పాట్లు పూర్తి
క్యూలైన్లలోని భక్తులకు తాగునీరు, పాలు, బాదంపాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేశారు. ఆదివారం రాత్రికే తమిళనాడుతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తిరుచానూరుకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందుకు తగ్గట్లుగా శాశ్వత, తాత్కాలిక, మొబైల్ అన్నీ కలిపి సుమారు 500 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వీటిని శుభ్రం చేయడానికి అదనంగా 700 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉదయం నుంచే వీరు విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు.. అమ్మవారి దర్శన సమయం, అన్నప్రసాదాలు, మరుగుదొడ్లు, పార్కింగ్ ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
భక్తుల కోసం ఏర్పాటు చేసిన 3 షెడ్లల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రం వద్ద ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు తోళ్లప్ప గార్డెన్, ఆలయం వద్ద అదనంగా రెండు అంబులెన్స్ లు సిద్దంగా ఉంచుతారు. ఇవి కాకుండా ఒక 108 కూడా సిద్ధం చేశారు. వైద్య, పారా మెడికల్ సిబ్బంది, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. స్విమ్స్, రుయా, టీటీడీ ఆయుర్వేద ఆసుపత్రులకు చెందిన వైద్యులు భక్తులకు సేవలందిస్తారు. పంచమి తీర్థానికి విచ్చేసే భక్తులకు శిల్పారామం, తనపల్లి క్రాస్, మార్కెట్‌యార్డు, రాహుల్ కన్వెన్షన్ సెంటర్, పూడి జంక్షన్, తిరుచానూరు శివారు వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహనాలను ఈ ప్రాంతాల్లో పార్కింగ్ చేసి పుష్కరిణికి నడచి వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
అందుబాటులో శ్రీవారి సేవకులు
పంచమి తీర్థంలో భక్తులకు సుమారు 1000 మంది శ్రీవారి సేవకులు ఆదివారం సాయంత్రం నుంచే వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 3 షెడ్లల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో షెడ్ వద్ద ఒక భారీ సామర్థ్యం కల జనరేటర్, విద్యుత్ దీపాలు పెట్టారు. దీంతో పాటు పంచమితీర్థం కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు, పుష్కరిణి నలువైపులా, మాడ వీధుల్లో ఎల్ ఈ డీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.. భక్తులను తాత్కాలిక షెడ్ల నుంచి క్రమ పద్ధతిలో పుష్కరిణికి పంపేలా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు పోలీసు, టీటీడీ భద్రత అధికారులు, సిబ్బందికి సహకరించి వారి సూచనలు పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులకు సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని అవసరమైన వారు ఈ సేవలు ఉపయోగించుకోవాలని టీటీడీ సూచించింది.
రోజంతా పంచమి ప్రాశస్త్యం
పద్మ పుష్కరిణిలో సోమవారం ఉదయం 11.40 నుంచి 11.50 గంటల మధ్య చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. పంచమి తీర్థం ప్రాశస్త్యం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది..