టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ రచయితల్లో విజయేంద్రప్రసాద్ ఒకరు. ఆయన తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాలకు కూడా రైటర్ గా పని చేస్తున్నారు. 'బాహుబలి', 'మణికర్ణిక', 'బజరంగి భాయ్ జాన్' లాంటో ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలకు కథలందించిన విజయేంద్రప్రసాద్ 'ఆర్ఆర్ఆర్' సినిమాకి కూడా కథ ఆయనే రాశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అసలు 'ఆర్ఆర్ఆర్' కథ ఎలా పుట్టింది..? ఈ కథ ఎవరి సలహా..? అనే విషయాల గురించి చెప్పుకొచ్చారు.

 

'ఆర్ఆర్ఆర్' కథ.. 

 

రాజమౌళి ఇద్దరు హీరోలతో ఓ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా చేయాలనుకున్నారట. రజినీకాంత్-ఎన్టీఆర్, అల్లు అర్జున్-ఎన్టీఆర్, కార్తీ-సూర్య, కార్తీ-బన్నీ ఇలా రకరకాల కాంబినేషన్ ల గురించి ఆలోచిస్తున్నప్పుడు రాజమౌళి ఓ ఆసక్తికర విషయం చెప్పినట్లు విజయేంద్రప్రసాద్ గుర్తుచేసుకున్నారు.  అల్లూరి సీతారామరాజు పోరాటయోధుడిగా మారడానికి ముందుకు కాలేజ్ చదువు పూర్తి చేసుకొని ఓ రెండేళ్లపాటు ఎక్కడికో వెళ్లిపోయారు. అక్కడనుండి వచ్చిన తరువాత ఆయన ఆంగ్లేయులపై పోరాటం చేశారు.

 

అయితే ఆయన ఎక్కడికి వెళ్లారు.. రెండేళ్లపాటు ఎక్కడ ఉన్నారనే విషయంపై సరైన సమాచారం లేదు. మరోవైపు అల్లూరి సీతారామరాజు వెళ్లిన సమయంలోనే కొమరం భీమ్ కూడా కొంతకాలం పాటు తెలంగాణ ప్రాంతం నుండి ఎక్కడికో వెళ్లారు. అక్కడ నుండి వచ్చిన తరువాత ఆయన కొమరం భీమ్ గా మారారు. ఈ విషయాన్ని చెప్పిన రాజమౌళి.. ''నాన్నా.. వీళ్లిద్దరూ ఒకే సమయంలో కొంతకాలం పాటు కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. ఒకవేళ వాళ్లిద్దరే కనుక ఒకరినొకరు కలుసుకొని ఉంటే ఎలా ఉంటుందని'' అడిగినట్లు విజయేంద్రప్రసాద్ తెలిపారు. అలా 'ఆర్ఆర్ఆర్' కథ పుట్టిందని వివరించారు. 

 

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ఈ సినిమాలో చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ కనిపించనున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. 

 


 

పవన్ తో సినిమా.. 

 

కొన్ని రోజులుగా విజయేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ఈ రైటర్. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని.. పవన్ కోసం ఓ కథ సిద్ధం చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నానని.. కానీ ఇప్పటివరకు ఆయన కోసం ప్రత్యేకంగా ఎలాంటి కథ రాయలేదని తెలిపారు. పవన్ కి కథ వివరించానంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఛాన్స్ వస్తే తప్పకుండా ఆయన కోసం కథ రాస్తానని మరోసారి చెప్పుకొచ్చారు.