తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ మూవీ చేస్తున్న ఆయన, వెంకట్ ప్రభుతో కలిసి మరో సినిమా చేస్తున్నారు. ‘Thalapathy 68’ పేరుతో ఈ సినిమా పనులు కొనసాగుతున్నాయి. ‘లియో’ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే వెంకట్ ప్రభు చిత్రం సైతం సెట్స్ మీదకు రాబోతోంది.
‘Thalapathy 68’ గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు
ఇప్పటికే ఈ సినిమా కోసం విజయ్ దళపతి, వెంకట్ ప్రభు సహా ‘Thalapathy 68’ బృందం లాస్ ఏంజెల్స్ కు వెళ్లింది. అక్కడి ఎయిర్ పోర్టులో తాజాగా విజయ్ కనిపించారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. తాజాగా వెంకట్ ప్రభు మరో అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం హీరో విజయ్ కి లాస్ ఏంజెల్స్ లో లుక్ టెస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోను దర్శకుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘వెల్ కం టు ది ఫ్యూచర్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
‘Thalapathy 68’లో విలన్ ఎవరు?
‘Thalapathy 68’ చిత్రంలో విజయ్ డబుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందబోతోంది. ఈ చిత్రంలో జ్యోతిక హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ ప్రియాంక ఆరుళ్ మోహన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మూవీలో ఎస్‌జే సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే, ఈ మధ్యే ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనే ఇందులో విలన్ పాత్ర చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఎస్‌జే సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు రావడం పట్ల సినీ అభిమానులు అయోమయంలో పడ్డారు. త్వరలోనే ఈ వార్తలపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ‘Thalapathy 68’ మూవీని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
విడుదలకు రెడీ అవుతున్న ‘లియో’
అటు విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన ‘లియో’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ప్రత్యర్థి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా కనిపించనున్నది. అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Read Also: రజినీకాంత్‌కు బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కళానిధి మారన్, ధర ఎంతో తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial