Trivikram about Vijay Devarakonda: వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు, ప్రముఖు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ వేడుకలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ విజయ్ దేరకొండపై ప్రశంసల జల్లు కురిపించారు.
ప్రేమను, అంతకు మించి ద్వేషాన్ని చూశాడు!
త్రివిక్రమ్ స్పీచ్ అంటేనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. ప్రతిమాట ప్రేక్షకులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ‘లక్కీ భాస్కర్’ సినిమా గురించి మాట్లాడిన ఆయన, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “విజయ్ దేవరకొండ నా ఫేవరెట్ యాక్టర్. విజయ్ ఎంతో ప్రేమను చూశాడు. అదే సమయంలో అంతకు మించిన ద్వేషాన్ని కూడా చూశాడు. తక్కువ సమయంలో ఈ రెండింటిని చూసిన విజయ్ చాలా గట్టివాడు. అమృతం కురిసిన రాత్రి పుస్తకంలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ‘మావాడు మహా గట్టివాడు’ అనే కవితను మాటను రాశారు. “మావాడు కూడా చాలా గట్టి వాడు” అంటూ విజయ్ ని అభినందించారు. త్రివిక్రమ్ మాటలకు విజయ్ ఎమోషనల్ అయ్యారు.
రౌడీ బాయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
డైలాగ్ రైటర్ గా, స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్.. ప్రశంసల జల్లు కురిపించడంతో విజయ్ దేవరకొండపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్రివిక్రమ్ ఎవరినీ అంత త్వరగా ప్రశంసించరని, విజయ్ ని అభినందించారంటే ఆయనలోని టాలెంట్ తనకు అర్థం అయ్యిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో VD12 అనే సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్ లో 12వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
‘లక్కీ భాస్కర్’ సినిమా గురించి...
దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా, అక్టోబర్ 31న విడుదలకానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పైసూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సంస్థకు త్రివిక్రమ్ కు మంచి అనుబంధం ఉంది. ఈ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమా విషయంలో త్రివిక్రమ్ పాత్ర ఉంటుంది. అందుకే ఈ సినిమా వేడుకకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమాలోని ప్రతి నటుడు ఎమోషనల్ గా నటించారని చెప్పారు. తడిచిన కళ్లతో నవ్వుతున్న పెదాలతో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటికి వస్తారని నమ్ముతున్నట్లు అభిప్రాయపడ్డారు.
Read Also: జ్యోతికతో సినిమా, సిగ్గు పడుతూ సూర్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?