రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ నెల 9న తన బర్త్ డే ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది తన బర్త్ డే సందర్భంగా విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీమ్ స్టోన్ సంస్థతో కలిసి దేశ వ్యాప్తంగా ఉన్న 8 ప్రధాన నగరాల్లోని ప్రజలకు ఉచితంగా ఐస్ క్రీమ్స్ పంపిణీ చేయాలని భావించారు.


8 నగరాల్లో ఉచితంగా ఐస్ క్రీమ్స్ పంపిణీ


అనుకున్నట్లుగానే విజయ్ తన బర్త్  డే(మే 9) రోజున హైదరాబాద్ లో 2 ఐస్ క్రీమ్ ట్రక్కులను జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్‌లో 2, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, వైజాగ్, పూణె, ముంబై , విజయవాడలో ఒక ట్రక్ ప్రజలకు ఉచితంగా ఐస్ క్రీమ్స్ పంపిణీ చేశాయి. వివిధ నగరాల్లోని అక్కడి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అవుట్‌లెట్ల నుంచి  ఐస్ క్రీమ్ ట్రక్కులు ప్రారంభం అయ్యాయి. “వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో 8 నగరాల్లో  మ్యాంగో రష్ ఐస్ క్రీమ్‌లను క్రీమ్ స్టోన్ పంపిణీ చేసింది. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ట్రక్కులను ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ట్రక్కులు మే 9 రోజున 8 నగరాల్లో ఐస్ క్రీమ్‌లను పంపిణీ చేశాయి” అని క్రీమ్ స్టోన్ సంస్థ  తెలిపింది. తాజాగా ఐస్ క్రీమ్ పంపిణీకి సంబంధించిన వీడియోను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్రీమ్ స్టోన్ సంస్థకు ధన్యవాదాలు చెప్పారు.






సరికొత్త ఐస్ క్రీమ్ ను తయారు చేసిన రౌడీ బాయ్


ఇక  హీరో విజయ్ దేవరకొండ తన పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ కోల్డ్ స్టోన్ ఐస్ క్రీమ్ క్రియేషన్స్‌ లో అగ్రగామిగా పేరుగాంచిన బ్రాండ్ క్రీమ్ స్టోన్ లో సందడి చేశారు. ఐస్ క్రీమ్ అంటే  ఎంతో ఇష్టం ఉన్న ఆయన స్వయంగా సొంతంగా ఐస్ క్రీమ్ కాన్సెప్ట్‌ ను సృష్టించారు. బ్రాండ్ క్రీమ్‌స్టోన్ దీనికి ‘విజయ్ దేవరకొండ క్రియేషన్’ అని పేరు పెట్టింది.  వీడీసీ అన్ని క్రీమ్‌ స్టోన్ అవుట్‌ లెట్‌లలో అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది.  






రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'ఖుషి'. సమంత హీరోయిన్ గా నటిస్తోన్నది. జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీశర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి తదితరులు నటిస్తున్నారు. హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.


Read Also:  'అన్నీ మంచి శకునములే' మూవీకి ‘ప్రాజెక్ట్ కె‘ సపోర్ట్ - అడగకుండానే ప్రజలకు సాయం, ఇదిగో వీడియో!