సినిమా పరిశ్రమ మరో గొప్ప రచయితను కోల్పోయింది. దిగ్గజ సినీ రచయిత బాల మురుగన్(86) తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ రచయిత భూపతిరాజా తండ్రి బాలమురుగన్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తాజాగా చెన్నైలోని ఆయన నివాసంలో కన్నుమూశారు.
రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న బాల మురుగన్
తెలుగు, తమిళంలో అనేక సినిమాలకు బాల మురుగన్ రచయితగా వ్యవహరించారు. ఆయన కథలు అందించిన ఎన్నో సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. శోభన్ బాబు, శివాజీ గణేషన్ లాంటి హీరోలకు పదుల సంఖ్యలో సినిమా కథలను అందించారు. వారు అగ్ర హీరోలుగా ఎదగడంలో బాల మురుగన్ కీలక పాత్ర పోషించారు. ఉత్తమ స్క్రిప్ట్ రైటర్‌గా రెండుసార్లు జాతీయ అవార్డు, అనేక రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. వయోభార సమస్యలతో బాధపుడుతున్న ఆయన, ఆదివారం సాయంత్రం చనిపోయినట్లు కుమారుడు, తెలుగు-తమిళ సినీ రచయిత భూపతి రాజా తెలిపారు.
తెలుగులో పలు హిట్ సినిమాలకు కథలు అందించిన బాల మురుగన్
బాల మురుగన్ తెలుగులో పలు హిట్ సినిమాలకు కథలు రాశారు. ‘ధర్మదాత’, ‘ఆలుమగలు’, ‘సోగ్గాడు’, ‘సావాసగాళ్లు’, ‘జీవన తరంగాలు’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు సమకూర్చారు. అంతేకాదు, తెలుగులో ఇప్పుడు టాప్ నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న గీతా ఆర్ట్స్ తొలి సినిమా ‘బంట్రోతు భార్య’కు ఆయనే కథ రాశారు. శోభన్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ‘సోగ్గాడు’ సినిమాకు ఆయనే కథ అందించారు. ఆ సినిమాతో శోభన్ బాబు కెరీర్ మరింత దూకుడుగా ముందుకు వెళ్లింది.
శివాజీ గణేషన్ సినిమాలకు ఎన్నో కథలు రాసిన బాల మురుగన్
ఇక తమిళంలో ఆయన కథ అందించిన ఎన్నో సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. తమిళంలో ఒకప్పుడు మకుటంలేని మహరాజుగా ఇండస్ట్రీని ఏలిన హీరో శివాజీ గణేషన్ సినిమాలకు ఆయనే ఎక్కువగా కథలు రాశారు. తను రాసిన కథలతో తెరకెక్కిన పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాయి. శివాజీ గణేషన్ కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆయన కథలు కీలక పాత్ర పోషించాయి.
బాల మురుగన్ మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం
బాల మురుగన్ మృతితో భూపతి రాజా ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. బాల మురుగన్ విషయం తెలియడంతో తెలుగు, తమిళ సినిమా పెద్దలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించేందుకు చెన్నైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : సక్సెస్ కోసం సౌత్ సినిమాల వెంట బాలీవుడ్ స్టార్స్!? - బాలీవుడ్‌లో 2023 ఫస్టాఫ్‌లో వస్తున్న సౌత్ రీమేక్స్ ఇవే