ప్రముఖ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha Movie) చిత్రంలో తొలి పాట విడుదల చేసిన సమయంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
విశ్వనాథునిచే విష్ణు వైభవం!
కిరణ్ అబ్బవరం హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఇందులో తొలి పాట 'వాసవ సుహాస...'ను కళాతపస్వి కె విశ్వనాథ్ విడుదల చేశారు. ఆ పాట శనివారం సాయంత్రం ఆరు గంటల పందొమ్మిది నిమిషాలకు యూట్యూబ్‌లో విడుదల చేయనున్నారు. ఆల్రెడీ విడుదలైన సాంగ్ ప్రోమోకి మంచి స్పందన లభించింది. దాంతో పాట కోసం ప్రేక్షకులకు ఎదురు చూస్తున్నారు.
'వాసవ సుహాస...' పాట విన్న తర్వాత ''నా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి'' అని విశ్వనాథ్ అన్నారు. నిర్మాతలు ఎలా ఒప్పుకున్నారని అనిపిస్తుందని ఆయన ప్రశ్నించారు. అప్పుడు నిర్మాత 'బన్నీ' వాస్ ''తిరుపతి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. మాకు ఇటువంటి పాట చేసే అవకాశం దొరికింది. మనం ఓ అద్భుతాన్ని వదిలేస్తున్నాం. ఈ రోజు ప్రేక్షకులకు కొంచెం ట్రెండీగా చెబితే ఇంకా బాగా వెళుతుందని చేశాం. ఇది అర్థం అవుతుందో? అర్థం కాదో? అనేది మనసులో ఉంది'' అని వివరించారు. నిజానికి అర్థం కాదని, ఇటువంటి పాట చేయడం గొప్ప విషయమని విశ్వనాథ్ అభినందించారు.
పండగ నేపథ్యంలో ఓ గుడిలో పాటను తెరకెక్కించినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం రెండు లుక్కుల్లో కనిపించారు. సంప్రదాయానికి చిరునామా లాంటి పాటలో పంచెకట్టుతో కనిపించారు. అలాగే, మోడ్రన్ డ్రస్‌లో కూడా సందడి చేశారు.
Also Read : '18 పేజెస్' రివ్యూ : నిఖిల్, అనుపమ నటించిన సినిమా ఎలా ఉందంటే?
ఫిబ్రవరి 17న 'వినరో భాగ్యము...'
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు. దానికి మూడు రోజుల తర్వాత... ఫిబ్రవరి 17, 2023లో 'వినరో భాగ్యము విష్ణు కథ'ను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఆల్రెడీ శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్... ఆ తర్వాత జూలైలో టీజర్ విడుదల చేశారు. చిత్తూరు నేపథ్యంలో ఏడుకొండల వెంకన్న సాక్షిగా తిరుమల తిరుపతి కొండల కింద జరిగే కథతో రూపొందుతోన్న చిత్రమిది.
'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో' లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ లో ఈ సినిమా మరో హిట్ అవుతుందని యూనిట్ నమ్ముతోంది.
Also Read : నటుడిగా కైకాల ప్రయాణంలో మజిలీలు - సత్యనారాయణ సమగ్ర సినిమా చరిత్ర
కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ (Kashmira Pardeshi) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బురు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : సత్య గమిడి - శరత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్, సహ నిర్మాత : బాబు, సంగీతం : చైతన్ భరద్వాజ్.