Vermines Movie: సాలెపురుగుల ఆధారంగా రూపొందిన సినిమాలన్నీ చాలా వరకు హారర్ జానర్ సినిమాలే. ‘ఇండియానా జోన్స్, ‘హ్యారీ పాటర్’ లాంటి ప్రాంచైజీలలో చూసిన స్పైడర్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇప్పటికే డజన్ల కొద్ది స్పైడర్ మూవీస్ విడుదలై ఆడియెన్స్ ను అలరించాయి. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి స్పైడర్ సినిమాలు బాగా నచ్చుతాయి. Arac Attack (2002), Arachnophobia (1990) లాంటి సినిమాలో ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ను అలరించాయి. ఇప్పుడు స్పైడర్ కథాంశంతో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘వెర్మిన్: ది ప్లేగ్’ పేరుతో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలోకి అడుగు పెట్టబోతోంది.


ఒళ్లు గగుర్పొడిచేలా ‘వెర్మిన్: ది ప్లేగ్’ ట్రైలర్


సెబాస్టియన్ వానిసెక్ దర్శకత్వంలో జెరోమ్ నీల్ ప్రధాన పాత్రలో నటించిన ‘వెర్మిన్: ది ప్లేగ్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరిస్తోంది. ఈ సినిమాలో స్పైడర్స్ సృష్టించే అల్లకల్లోలం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ భయానక స్పైడర్ మూవీ నిడివి 1 గంట 45 నిమిషాలు. విషపూరిత సాలీడును ఇంటికి తీసుకొచ్చే యువకుడు కాలేబ్(జెరోమ్ నీల్) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. 30 ఏండ్ల వయసు ఉన్న యువకుడు ఓ సాలీడును ఇంటికి తీసుకొస్తాడు. ఒక పెట్టెలో ఉంచి ఇంట్లో పెడతాడు. ఆ సాలీడు బాక్స్ కు రంద్రం చేసుకుని బయటకు వస్తుంది. కాలేబ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఈ సాలెపురుగు ఎలాంటి విపత్తుకు కారణం అయ్యిందో ఈ సినిమాలో చూపించబోతున్నారు.   


ఫిబ్రవరి 2 నుంచి థియేటర్లలో అలరించనున్న ‘వెర్మిన్: ది ప్లేగ్’


కాలేబ్ తీసుకొచ్చిన సాలెపురుగు అత్యంత తక్కువ సమయంలో తన సంతానాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఆ సాలెపురుగులు అన్నీ కలిసి ఓ నగరాన్ని కబలించే ప్రయత్నం చేస్తాయి. వాటిని అదుపు చేసేందుకు ఏకంగా సైన్యం రంగంలోకి దిగాల్సి వస్తుంది. మొత్తంగా గతంలో వచ్చిన సాలీడు సినిమాలకు తలదన్నేలా ఉండబోతోంది ‘వెర్మిన్: ది ప్లేగ్’ మూవీ. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారిని ఫిబ్రవరి 2 నుంచి థియేటర్లలో అమితంగా ఆకట్టుకోబోతోంది.



‘వెర్మిన్: ది ప్లేగ్’ సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డులు  


ఇక ‘వెర్మిన్: ది ప్లేగ్’ సినిమా విడుదలకు ముందే పలు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంటోంది. ఈ చిత్రం ఫ్రాన్స్ లో ఆస్కార్ అవార్డులుగా భావించే సీజన్ అవార్డులకు రెండు నామినేషన్లను అందుకుంది. అటు సిట్జెస్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది. అంతేకాదు, 2024లో విడుదలయ్యే అత్యంత ఉత్తమ భయానక చిత్రాల్లో ఒకటిగా నిలువబోతోందని మేకర్స్ వెల్లడించారు. సాలెపురుగులను చూసి భయపడే వాళ్లు ఈ సినిమాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తున్నారు. ఈ సినిమా సాలీడుల నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో స్పెషల్ కాబోతుందంటున్నారు.


Read Also: నా తొడలు ఎలా ఉన్నా ఇబ్బంది లేదు, మృణాల్ అంత మాట అనేసింది ఏంటి?