పోలీసులతో వివాదం కారణంగా టాలీవుడ్ నటి డింపుల్ హయతి ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామితో డింపుల్ తన ఇంట్లో పూజలు చేయించారు. ఏ పూజలు చేయించారు అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. వీటికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.


వేణు స్వామి గతంలో కూడా పలువురు హీరోయిన్లతో పూజలు చేయించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, సమంత, నిధి అగర్వాల్ తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు డింపుల్ హయతి కూడా ఈ లిస్టులో చేరారు.


గతంలో కోర్టు కేసులు
పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని టాలీవుడ్ నటి డింపుల్‌ హయతి గతంలోనే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం తెలిసిందే. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే కారును ఢీకొట్టిన కేసును కొట్టివేయాలని హైకోర్టును డింపుల్ ఆశ్రయించారు. అధికారం ఉందని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఒత్తిడి చేయడంతో పోలీసులు తనపై కేసు నమోదు చేశారని డింపుల్ హయతి పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టును కోరారు. డింపుల్ హయతి పిటిషన్ గతంలోనే హైకోర్టులో విచారణకు వచ్చింది. డింపుల్ హయతికి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ సమయంలో హైకోర్టుకు తెలిపారు. 


పోలీసులు సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకు నడుచుకోవాలని డింపుల్ హయతికి హైకోర్టు సూచించింది. ఆ నోటిసులకు అనుగుణంగా విచారణకు హాజరు కావాలని నటి డింపుల్ హయతిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న లాయర్ విక్టర్ డేవిడ్‌కు కూడా 41ఏ నోటీసు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు సూచించింది.  సీఆర్పీసీ 41ఏ నోటీసులు అందుకున్న వారు చట్టాన్ని అనుసరించి విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.  


జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదు 
రాహుల్ హెగ్డే, డింపుల్ హయతి వివాదం ముదిరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో నటి డింపుల్‌ హయతి ఉంటున్నారు. అదే అపార్టుమెంట్‌లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే కూడా నివసిస్తున్నారు. డీసీపీకి చెందిన ప్రభుత్వ వాహనాన్ని వారి అపార్ట్ మెంట్ సెల్లార్‌లో పార్కింగ్‌ చేశారు. ఆ వాహనం పక్కనే నటి తన వాహనాన్ని పార్కింగ్‌ చేస్తారు. కానీ డింపుల్ తన కారు కవర్ ను తొలగిస్తుందని, తన కారును ఢీకొట్టిందని డీసీపీ రాహుల్ హెగ్డే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ చేతన్ కుమార్ సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులకు ఇవ్వగా వారు జూబ్లీహిల్స్ పోలీసులు నటి డింపుల్ హయతిపై కేసు నమోదు చేశారు.