సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ప్రయోగాలతో వరుస సినిమాలు చేస్తున్న హీరో వరుణ్ తేజ్. సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే వరుణ్ తేజ్.. ‘ఎఫ్3’ సినిమా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ‘గని’ సినిమాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నా.. ‘ఎఫ్3’తో ఆ బాధలో నుంచి బయటపడ్డాడు. తన తర్వాత సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఎయిర్ ఫోర్స్ కథాంశంతో యధార్థ ఘటనల ఆధారంగా ఓ సినిమా మొదలుపెట్టేశాడు. ఇందులో ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు వీటీ13 ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేశాడు. “అవధులు లేని ధైర్యసాహసాలు, శౌర్యం పట్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబరాలు చేసుకోబోతుంది. ఆకాశంలో జరిగే యుద్ధాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు సిద్ధంగా ఉండండి. త్వరలో టేకాఫ్ కు సిద్ధం అవుతుంది” అంటూ వరుణ్ క్యాప్షన్ పెట్టాడు.
తాజాగా విడుదలైన పోస్టర్ లో వరుణ్ తేజ్ యుద్ద విమానాన్ని నడిపే పైలెట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ & రెనైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఇప్పటికే వరుణ్ తేజ్ ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న వీడియోను శనివారం నాడు ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. ఈ వీడియో మూవీపై ఎంతో ఆసక్తిని కలిగించింది. ఈ వీడియోలో వరుణ్ తేజ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చదువుతున్నట్లు కనిపిస్తాడు. చివరల్లో స్క్రిప్ట్ బుక్ పై ఓ ఎయిర్ క్రాఫ్ట్ బొమ్మని పెట్టి వెళ్తాడు. ఆ తర్వాత విమానం టేకాఫ్ శబ్దం రావడం కనిపిస్తుంది. ఇంతకీ ఈ సినిమా కథాంశం ఏంటనే విషయంపై ఆసక్తి కలిగేలా జాగ్రత్తలు తీసుకుంది సినిమా బృందం.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను వరుణ్ తేజ్ వెల్లడించాడు. ఎయిర్ ఫోర్స్ లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు చెప్పాడు. అటు సినిమా నిర్మాణ సంస్థలను చూస్తుంటే ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా తెరక్కనున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఈ సినిమా వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సినిమా పరిశ్రమలో టాక్ నడుస్తున్నది. యుద్ధ విమానాన్ని నడుపుకుంటూ పాక్ ఆర్మీకి చిక్కిన వర్థమాన్.. భారత ప్రభుత్వం జోక్యంతో భారతదేశానికి అప్పగించబడ్డాడు. అదే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తున్నది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.
మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పటికే పలు డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కంచె, అంతరిక్షం, గద్దలకొండ గణేష్ వంటి సినిమాల్లో అద్భుత క్యారెక్టర్లు చేశాడు. ఈ ఏడాది రిలీజ్ 'గని' సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. కానీ, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత F3 విజయం సాధించడంతో ‘గని’ ఫెయిల్యూర్ నుంచి బయట పడ్డాడు. తాజాగా మరో సరికొత్త కథాశంతో మరో ప్రాజెక్టు చేస్తున్నాడు.